6 August, 2026 | 3:25 AM

అప్రమత్తతే సైబర్ నేరాలకు అడ్డుకట్ట

06-08-2026 12:09 AM
  1. సురక్షా తిరంగాలో భాగంగా విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన
  2. ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్

పాపన్నపేట, ఆగస్టు5  (విజయక్రాంతి) : సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని పాపన్నపేట ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ’సురక్షా తిరంగా’ కార్యక్రమంలో భాగంగా పాపన్నపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై విలువైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్త్స్ర మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్నాకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు,

ఈ-మెయిల్స్, సోషల్ మీడియా లింకులను నమ్మవద్దని సూచించారు. ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించరాదని స్పష్టం చేశారు. ఫేక్ ఉద్యోగాల ప్రకటనలు, ఆన్లైన్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, కేవైసీ అప్డేట్, లాటరీ, రివార్డు పేర్లతో జరుగుతున్న మోసాలపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించారు. సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని, సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని, సకాలంలో ఫిర్యాదు చేస్తే నష్టాన్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సింలు , అధ్యాపకులు శ్రీనివాస్, ప్రవీణ్, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.