28 August, 2026 | 8:38 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

28-08-2026 07:50 PM

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ, వారి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. మల్కేపల్లి ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, వంటశాల, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించి బోధన, తరగతుల నిర్వహణ, వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధన అందించాలని, వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలనిన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మండలంలోని సోనాపూర్ గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ విచారణలను పరిశీలించి ప్రక్రియకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు.

గ్రామంలో బెల్లంపల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో, నాబార్డ్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సహకారంతో నిర్వహిస్తున్న పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం, అగ్రో ఫారెస్ట్రీ ప్రాజెక్టులో భాగంగా కోలాం గిరిజన కుటుంబాలకు మామిడి, ఉసిరి, పనస, జామ, బొప్పాయి తదితర పండ్ల మొక్కలను ఉచితంగా అందజేశారు. ప్రతి కుటుంబం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబాలకు పౌష్టికాహారం, భవిష్యత్తులో అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని తెలిపారు.

గ్రామస్థులతో మాట్లాడి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించి పనులు వేగవంతం చేయాలని, గిరిజన ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి అనిత, తహసీల్దార్ సునీల్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి సఫ్దర్ అలీ, మండల విద్యాధికారి, ఎఫ్‌పిసి ఛైర్మన్ ఎంబడి కిషన్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, సర్పంచ్‌లు, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.