రైతన్నకు యూరియా తిప్పలు?
- అన్నదాతకు తప్పని యూరియా అవస్థలు
యూరియా కొరతతో రైతులు ఆందోళన
యాప్‌లో ఎంటర్ చేసే విధానం తెలియక తికమక పడుతున్న రైతులు
అసైన్డ్ భూములు, ఇతర భూముల ఉన్న రైతులకు తప్పని యూరియా తిప్పలు
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 26, (విజయక్రాంతి): రైతులకు యూరియా అవస్థలను తొలగించేందుకు ప్రభుత్వం యాప్ విధానాన్ని తీసుకువచ్చింది. రైతులకు యూరియా కావాల్సిన వారు ట్యాబ్ లోని యాప్ లో నమోదు చేసుకోవాలి. విధానం బాగానే ఉన్నా యాప్ కష్టాలు మాత్రం రైతులకు తప్పడం లేదు. యాప్ లో నమోదు చేయడం తెలియక రైతులు తికమక పడుతున్నారు. ఎంతో కష్టపడి ఆరుగాలం శ్రమించి పండించే పంటకు సమయానికి పంటకు యూరియా చల్లడానికి రైతులు యూరియా కోసం తంటాలు పడుతున్నారు.
తగిన స్టాక్ అందుబాటులో లేక ఈ యాప్ లో నమోదు చేసుకున్న రైతులకు యూరియా అందజేస్తామని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. యూరియా కావలసిన రైతులకు యూరియా దొరకక పోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్రికల్చర్, ఫర్టిలైజర్ యాప్ ద్వారా రైతులు ఎకరనికి దశలవారీగా ఒక్కొక్క బస్తా అందించడంతో రైతులకు తీవ్ర అవస్థలు ఎదురవుతున్నాయి అని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.
పట్టా, పాస్ బుక్ ఉన్న రైతులకు మాత్రమే యూరియా
పట్టా పాస్బుక్ ఉన్న రైతులకు మాత్రమే ప్రస్తుతం యూరియా లభిస్తుంది. యూరియా కావలసిన రైతులందరికీ పంటలకు సరిపడా యూరియా అందడం లేదు. అక్కడక్కడ కొంతమంది రైతులకు బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతుందని, అది కూడా సమయానికి దొరకక పోవడంతో పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు.కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల, ఈ సంవత్సరం రైతులకు ఈ తిప్పలు తప్పవని రైతులు వాపోతున్నారు.
పట్టా పాస్ బుక ఉన్న కొందరి రైతుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేకపోవడం యూరియా రైతులకు అందకపోవడం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సన్న, చిన్నకారు రైతులు స్మార్ట్ ఫోన్ లేక ప్రాథమిక సహకార సంఘాల వద్ద, బారులు తీరుతున్నారు.
సహకార సంఘాల వద్ద సిబ్బంది యూరియా వచ్చిన క్షణాల్లోనే నచ్చిన వారికి ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తూ బుక్ చేసుకోమని చెప్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ గ్రామంలోని రైతులకు యూరియా అందకుండా చేస్తున్నారని పలువురు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా సొసైటీ కి వచ్చే సమయానికి సహకార సంఘంలో పనిచేస్తున్న సిబ్బంది బంధువులను తమ దగ్గర వ్యక్తులను పలువురిని పిలిపించుకొని ఆన్లైన్లో బుక్ చేపిస్తూ విక్రయిస్తున్నారనీ, పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
యూరియా వచ్చినా సమాచారం రైతులకు తెలియదు
ఆన్లైన్లో యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ యూరియా గ్రామంలోని పట్టణంలోని సహకార సంఘాలకు ఎప్పుడు వస్తుందో ఏలా వస్తుందో తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా విక్రయించడం పట్ల పలువురు రైతులు అవస్థలు పడుతున్నారు. ఫిబ్రవరి 6 నుండి ఫిబ్రవరి 25 వరకు జిల్లాలో ఎక్కడైనా యూరియా ఆన్లైన్లో తీసుకోవచ్చునని యాప్ లో తెలపడంతో రైతులు యూరియా బస్తాలను బస్తా ధర కంటే ట్రాన్స్పోర్ట్ ఖరీదు అధికంగా పెట్టి కొనుగోలు చేసి పంటలను కాపాడుకోవడం కోసం ముమ్మర ప్రయత్నాలు అన్నదాతలు చేస్తున్నారు.
ఫిబ్రవరి 26 నుండి ఏ మండలానికి చెందిన రైతులు ఆ మండలంలోని సహకార సంఘాలు, ఫర్టిలైజర్ దుకాణాలు లో మాత్రమే యూరియా విక్రయించుకోవచ్చునని యాప్ ద్వారా సూచిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పలువురు పేర్కొన్నారు.
ఎల్లారెడ్డి మండల వ్యవసాయ అధికారి నీ వివరణ కోరగా, ఇకనుండి రైతులకు ఏ మండలానికి చెందిన రైతులకు ఆ మండలంలోని ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఫర్టిలైజర్ దుకాణ సముదాల ద్వారా యూరియా విక్రయించడం జరుగుతుందని యూరియా పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని నిరంతరం యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రైతులు యూరియా పట్ల ఎటువంటి ఆందోళన చెందడం అవసరం లేకుండా సమీపంలోని సహకార సంఘాల వద్ద కానీ ఫర్టిలైజర్ దుకాణాల వద్ద కానీ ఇకనుండి యూరియా అందుబాటులో ఉంటుందని వేరే ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని అనవసరంగా ట్రాన్స్పోర్ట్ చార్జీలు భరించకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ మండలంలోని రైతులకు అందుబాటులో దొరికే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు.
అసైన్డ్ , ఇతర పోడు పట్టాలు పొందిన రైతులు ఆందోళన చెందవద్దు
అసైన్డ్, పోడు పట్టా పొందిన రైతులు తమ పట్టా పాస్ పుస్తకము, ఆధార్ కార్డులు తీసుకొని మండల వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే యాప్ ద్వారా తమ సమస్య తీరుతుందని యూరియా లభిస్తుందని వ్యవసాయ అధికారిని ఆచరిత తెలిపారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి రైతుకు యూరియా లభిస్తోందన్నారు.
- ఎల్లారెడ్డి వ్యవసాయ అధికారి, ఆచరిత




