17 May, 2026 | 2:48 PM

ధాన్యం కొనేందుకు ప్రతి పైసా కేంద్రం ఇస్తోంది: కిషన్ రెడ్డి

17-05-2026 01:25 PM

హైదరాబాద్: ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు ధర్నా చేస్తున్నారని, తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనట్లేదో రైతులకు చెప్పాలని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వట్లేదని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోళ్లు చేసేందుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అయినప్పటికి రైతుల నుంచి ధాన్యం ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు. 

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చట్లేదని, మంత్రులు జిల్లాలకు వెళ్లి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని కోరారు. ఒక్కో యూరియా బస్తాపై కేంద్రం రూ.2500 ఖర్చు చేస్తోందని, ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయట్లేదని ఆయన వెల్లడించారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారని, ఎస్ఐఆర్ ప్రక్షాళనలో బీఎల్ఓలు ప్రధానపాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు. బీఎల్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారని, కానీ ఆ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఎల్ఓతో పాటు పార్టీలు నియమించిన బీఎల్ఏలు ఉంటారని, పార్టీలు నియమించిన బీఎల్ఏలు ఉంటే కుట్ర ఎలా జరుగుతుందో చెప్పాలని అడిగారు.  ఎస్ఐఆర్ లో ఎలాంటి అవకతవకలు లేకున్నా కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తోందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.