20 May, 2026 | 3:46 AM

అంత్య పుష్కరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా

20-05-2026 01:12 AM

ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి 

మహబూబాబాద్, మే 19 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు హాజరయ్యే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా కు ఏర్పాట్లు పూర్తి చేశామని, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మొత్తం 330 ఎనిమిది మీటర్ల స్తంభాలు, 152 తొమ్మిది మీటర్ల స్తంభాలు, 8 పదకొండు మీటర్ల స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సుమారు 5 కి.మీ. 11 కేవీ లైన్, 12 కి.మీ. ఎల్టీ లైన్ వేయడం పూర్తయినట్లు వెల్లడించారు. మొత్తం18 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా నిర్వహణ కోసం 16 కీలక ప్రాంతాలలో 12 రోజుల పాటు రౌండ్ ది క్లాక్ పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు.

విధుల్లో నలుగురు డివిజనల్ ఇంజినీర్లు, ఆరుగురు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, 13 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 12 మంది సబ్ ఇంజినీర్లు, 13 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 9 మంది లైన్మెన్లు, 45 మంది అసిస్టెంట్ లైన్మెన్లు తదితర సిబ్బంది కలిపి మొత్తం 150 మంది విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్లు విఫలమైన సందర్భంలో వెంటనే మార్పిడి చేయడానికి అదనపు స్పేర్ ట్రాన్స్ఫార్మర్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

దేవాలయం, టెంట్ సిటీ, వీఐపీ ఘాట్, మెయిన్ ఘాట్, హరిత హోటల్ తదితర కీలక ప్రాంతాలకు డబుల్ ఫీడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక ఫీడర్లో అంతరాయం ఏర్పడినప్పటికీ మరో ఫీడర్ ద్వారా వెంటనే విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బ్రేక్డౌన్ పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కాళేశ్వరం, మహాదేవపూర్, 132 కేవీ కాటారం సబ్స్టేషన్ వద్ద ప్రత్యేక బ్రేక్డౌన్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడం మా ప్రధాన లక్ష్యం అని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.

భక్తులకు విద్యుత్ భద్రతా సూచనలు

పుష్కర ఘాట్లు, రహదారులు, పూజా మండపాల సమీపంలో ఎర్ర,తెలుపు రంగుల హెచ్చరిక టేపులతో సైన్బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యుత్ తీగలకు దగ్గరగా వెళ్లకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నంబర్ 1912 ను సంప్రదించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు.