31 May, 2026 | 2:09 AM

ట్రంప్ గరం గరం

31-05-2026 12:43 AM
  1. శాంతి ఒప్పందంపై సంతకానికి నిరాకరణ
  2. ఇరాన్ యురేనియం నిల్వలు అప్పగించాలని మొండిపట్టు

వాషింగ్టన్, మే ౩౦: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసేందుకు నిరాకరించారు. ఇరాన్ ప్రతిపాదించిన నావిక దిగ్బంధం ఎత్తివేత, తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆమోదించకుండానే ఆయన తాజాగా వైట్ హౌస్ సమావేశాన్ని ముగించారు. ఈ అంశంపై తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా స్పందిస్తూ.. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని తేల్చిచెప్పాల్సిందేనని, యురేనియం నిల్వలను సైతం తమకు అప్పగించాలని ఉద్ఘాటించారు.

హోర్ముజ్ జలసంధి వద్ద ఎలాంటి ట్రాన్సిట్ ఫీజు వసూలు చేయకూడదని పేర్కొన్నారు. అంతకుముందు శాంతి ఒప్పందంపై తనదే పైచేయి అని, తనదే తుది నిర్ణయం తీసుకుంటానని అట్టహాసంగా చెప్పుకొన్న ట్రంప్ ఇప్పుడు వెనక్కి తగ్గడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా నావికా దిగ్బంధనంతో పాటు కొన్ని ఇతర అలవిగాని ఇరాన్ డిమాండ్ల వల్లే ట్రంప్ వెనక్కి తగ్గారని వైట్‌హౌస్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, ట్రంప్ తీరుపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సలహాదారు మొహమ్మద్ రెజాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ దౌత్యాన్ని ట్రంప్ గడ్డిపోచతో సమంగా తీసిపారేశారని మండిపడ్డారు.

అమెరికా యూ టర్న్

గ్రీన్‌కార్డుల జారీ ప్రక్రియలో అమెరికా యూ టర్న్ తీసుకున్నది. అమెరికాలో శాశ్వత నివాస హోదా కలిగిన వారు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే స్వదేశానికి వెళ్లాల్సిందేనని, అసాధారణ పరిస్థితుల్లో ఉన్నవారు తప్ప మిగిలిన వారందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని అగ్రరాజ్యం గత వారం ప్రకటించింది. కానీ, ఇంతలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని తూచ్.. అంది. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తుదారులు తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో ఇక అర్హులైన వలసదారులు అమెరికాలోనే ఉండి స్టేటస్ అడ్జస్ట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నిర్ణయంతో స్థానికంగా ఆందోళనలు తగ్గాయి.