31 May, 2026 | 1:35 AM

అక్రమ వలసలపై ఉక్కుపాదం

31-05-2026 12:42 AM
  1. బంగ్లా వైపునకు పయనమైన వలసదారులు
  2. బెంగాల్ కొత్త సీఎం సువేందు దూకుడు చర్యలు
  3. వెళ్లకుంటే.. తామే గెంటి వేస్తామనే సీఎం హెచ్చరికలు
  4. రాష్ట్రవ్యాప్తంగా ఏరివేత చర్యలు
  5. ౧౫ లక్షల మంది అక్రమ వలసదారుల గుర్తింపు
  6. సంక్షేమ పథకాల జాబితాలో ౧౨ లక్షల మంది తగ్గుదల
  7. కోట్లాది రూపాయల ప్రజాధనం ఆదా

కోల్‌కతా, మే ౩౦: పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నది. ‘అక్రమ వలసలను గుర్తించండి, తొలగించండి, బహిష్క రించండి’ అన్న ముఖ్యమంత్రి సువేందు అధికారి పిలుపును అందుకుని యంత్రాం గం దూకుడుగా వ్యవహరిస్తున్నది. ‘సర్’ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసిన తర్వాత అక్రమ వలసదారులను గుర్తించడం అధికారులకు తేలికైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 15 లక్షల మంది చొరబాటుదారులను గుర్తించింది.

బంగ్లాదేశ్ నుంచి వలసలను ఉద్దేశించి ‘మేం గెంటేయకముందే స్వచ్ఛందంగా వెళ్లిపోండి’ అని సీఎం చేసిన హెచ్చరికలకూ భారీగా స్పందన వస్తున్నది. వేలాది సంఖ్యలో బంగ్లాదేశ్ వలసదారులు మూటాముల్లె, పిల్లాజె ల్లాను పట్టుకుని తమ దేశ సరిహద్దుల వైపు పయనమవుతున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బిథారి హకీంపూర్ అంతర్జాతీయ సరిహ ద్దు వద్ద వేలాది మంది పోగయ్యారు. అలా గే, మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో యం త్రాంగం రెండు నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఆయా చోట్ల యంత్రాంగం కోర్టుల ప్రమేయం లేకుండానే పోలీసుల మాధ్యమంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించడం గమనార్హం.

ఈ ఏరివేత చర్యల వల్ల రాష్ట్రంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలో 12 లక్షల మంది తగ్గారంటే వలసలు ఏ స్థాయిలో ఉన్నాయే అంచనా వేయవచ్చు. ముఖ్యంగా ఉచిత రేషన్, మహిళల ఆర్థిక సహాయ పథకాల లబ్ధిదారుల సంఖ్య అమాంతం పడిపోయింది. బెంగాల్ ప్రభుత్వానికి కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా కానుంది. వలసదారులంతా నకిలీ పత్రాలతో సంక్షేమ ఫలాలను పొందుతున్నారని యంత్రాంగం గుర్తించింది. అర్హులైన స్థానిక పేదలకు మాత్రమే సాయం అందించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నది.

అంతా.. చట్ట ప్రకారమే

విదేశీయుల చట్టానికి లోబడే వలసదారుల గుర్తింపు, గెంటివేత చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం సువేందు స్పష్టం చేశారు. అంతేకాదు.. వలసదారులుగా గుర్తించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ జైళ్లకు తరలించొద్దని ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆశ్రయమిచ్చి, తిండి పెట్టడానికి, వారేమీ మన బంధువులు కాదని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భంలో కోర్టుల చట్టపరమైన విచారణల జోలికి వెళ్లకుండా నేరుగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)కు వలసదారులను అప్పగించాలని ఆదేశించారు.

అయితే.. వలసదారులను బంగ్లా ప్రభుత్వానికి అప్పగించేంత వరకు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచాలని నిర్ణయించారు. దీనిలో భాగంగానే ఈనెల ౨౫న మాల్డా, ముర్షిదాబాద్ జిల్లాల్లో నిర్బంధ (హోల్డింగ్) కేంద్రాలు ఏర్పాటు చేయించారు. త్వరలో మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్రాల ఏర్పాటుతో వలసదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. కొందరైతే నిర్బంధ కేంద్రాలకు వెళ్లడం ఇష్టం లేక తమ దేశానికే వెళ్లిపోతామని అధికారులకు చెప్తున్నారు.

కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు

కేంద్ర హోంశాఖ (ఎమ్‌హెచ్‌ఏ) మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. గతేడాది మే 2న కేంద్ర హోంశాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం.. బంగ్లాదేశ్, మయన్మార్ (రోహింగ్యాలు) నుంచి చొరబడిన వారిని నిర్బంధించేందుకు ప్రతి జిల్లాలో హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హోల్డింగ్ సెంటర్లలో ప్రధానంగా రెండు రకాల విదేశీయులను ఉంటారు.

మొదటి విభాగంలో భారత్‌లో అక్రమంగా నివసిస్తూ అధికారులకు పట్టుబడిన చొరబాటుదారులు ఉంటారు. రెండవ విభాగంలో భారతీయ జైళ్లలో తమకు విధించిన శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వేచి చూస్తున్న ఖైదీలు ఉంటారు. పౌరసత్వ చట్టం ప్రకారం.. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినా, లేదా పత్రాల గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడే ఉండిపోయినా వారిని అక్రమ వలసదారులుగానే అధికారులు పరిగణిస్తారు.

సరిహద్దుల్లో పట్టుబడే చొరబాటుదారుల విషయంలో కేంద్ర హోంశాఖ కఠినమైన ప్రొటోకాల్స్ విధించింది. భూ సరిహద్దులు లేదా సముద్ర మార్గాల ద్వారా భారత్‌లోకి ప్రవేశిస్తూ పట్టుబడే బంగ్లాదేశీయులు, రోహింగ్యాల వేలిముద్రలు, ముఖచిత్రాలను (ఫేషియల్ ఫొటోగ్రాఫ్స్) ఇక్కడి యంత్రాంగం సేకరించాల్సి ఉంటుంది.

జీవనోపాధి వదిలి వెనక్కి

రెండు దేశాల సరిహద్దు వద్ద వేచి ఉన్న వలసదారుల్లో ఎక్కువ మంది కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోని అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నవారే. వీరంతా భవన నిర్మాణ రంగాలు, హోటళ్లు, మత్స్య పరిశ్రమలు, ఇళ్లలో పనిమనుషులుగా జీవనం సాగిస్తున్నారు. ఖుల్నా ప్రాంతానికి చెందిన తక్లిమా ఖాతూన్ అనే మహిళ రెండేళ్ల క్రితం భారత్‌లోని కోల్‌కతాకు వలసొచ్చి ఇళ్లలో పనిమనిషిగా కుదిరింది. తాజా ఒత్తిళ్లతో స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధమైంది.

జిల్లాల్లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్

ఇప్పటికే దేశంలోని వివిధ ప్రాంతా ల్లో స్థిరపడిన అక్రమ వలసదారులను ఏరివేతకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసిం ది. బెంగాల్‌లోని ప్రతి జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో ఒక ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (ఎస్టీఎఫ్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ టాస్క్ ఫోర్స్ సిబ్బంది క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి అక్రమ వలసదారులను గుర్తిస్తారు.