బొల్లిగూడoలో భూపోరాటం ఉద్రిక్తం
టిఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అరెస్టు
పోలీసులు బోడుప్పల్ లో అదుపులోకి తీసుకొని... బొల్లారం పీఎస్ కు తరలింపు
మేడిపల్లి, జూలై 2 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బొల్లిగూడంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఉప్పల్ బాగాయత్ లో నిర్వహించాలనుకున్న సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు పలువురు నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకోవడంతో, సభా వేదికను బోడుప్పల్ లోని బొల్లిగూడానికి మార్చారు. అక్కడ కూడా సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. భూపోరాట సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లకు అనుమతి లేదని, పోలీసు బలగాలతో వాటిని తొలగించారు.
దీనిని వ్యతిరేకిస్తూ తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భూపోరాటంలో పాల్గొనేందుకు బొల్లిగూడానికి వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కవిత అరెస్టును నిరసిస్తూ ఉద్యమకారులు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. బొల్లిగూడం ప్రాంతంలోని దళితుల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఎకరానికి 600 గజాల చొప్పున ప్లాట్లు కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందని స్థానిక దళితులు తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన చేపట్టిన భూపోరాటాన్ని కొందరు స్థానికులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసన కారులను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఘట్కేసర్, ఇతర పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు సమాచారం. సమాచారం తెలుసుకొని కార్యకర్తల విడుదల కోసం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ప్రస్తుతం బోడుప్పల్ పరిధిలోని బొల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.






