19 July, 2026 | 3:08 PM

నకిలీ సర్టిఫికెట్ తో పట్ట మార్పిడి.. తహసీల్దార్, జీపీఓ సస్పెండ్

19-07-2026 09:32 AM

తాహశీల్దార్, జి.పి.ఒ. సస్పెన్షన్

దమ్మపేట,  (విజయక్రాంతి): భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సంచలనం రేపిన అక్రమ వారసత్వ పట్టామార్పిడిలో దమ్మపేట తాహశీల్దార్ కె. రాంనరేష్, పెద్దగొల్లగూడెం గ్రామ పరిపాలన అధికారి వలవల అనంతమ్మను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. దమ్మపేట మండల పరిధిలోని ఏజెన్సీ ఏరియాలో గల పెద్దగొల్లగూడెం రెవెన్యూ సర్వే నెంబరు 385/54లో మళ్ళాసత్యం పేరుతో వున్న 5.00 ఎకరముల ఎసైన్మెంట్ భూమిని పట్టాదారు మళ్ళా సత్యం బ్రతికి వుండగానే నకిలీ మరణ ధృవపత్రము, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృషించి, పట్టాదారు మళ్ళా సత్యంకు ఎటువంటి బంధుత్వం లేని నామ పుష్పవతి భర్త సత్యనారాయణ పేరుతో వారసత్వ పట్టా మార్పిడి చేశారు. 

ఈ వారసత్వ పట్టా మార్పిడిపై జిల్లా కలెక్టర్ అంకిత్. కొత్తగూడెం రెవిన్యూ డివిజనల్ అధికారి మధు ను విచారణ అధికారిగా నియమించారు.  రెవిన్యూ డివిజనల్ అధికారి విచారణలో వీరు క్షేత్ర స్థాయి విచారణ మరచి, ఉద్ధేశ్యపూర్వకంగా, దురుద్ధేశ్యంతో, ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి ఏ సంబంధం లేని వ్యక్తికి పట్టామార్పిడి చేశారని, ఇది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు కలెక్టర్ కు నివేదించారు. దీంతో కలెక్టర్ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దుర్వినియోగం చేసినట్లు పేర్కొంటూ జీపీఓ వలవల అనంతమ్మ, తహసీల్దార్ కె రామ్ నరేష్ లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తమ తమ హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళరాదని సస్పెన్షన్ ఆర్డర్ లో పేర్కొన్నారు. ఇదిలా వుండగా నకిలీ మరణధృవీకరణ పత్రము, నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో అక్రమ వారసత్వ పట్టా మార్పిడి చేసిన అధికారులు సస్పెండ్ కాగా, అసలు సూత్రధారి, లబ్ధిపొందిన నామ పుష్పావతి భర్త సత్యనారాయణలపై అధికారులు ఏ చర్య తీసుకుంటారో వేచి చూద్దాం.