30 August, 2026 | 11:32 AM

10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!

30-08-2026 10:52 AM

ముందస్తు హెచ్చరిక లేకుండానే రోడ్లు మూసివేత

కేబుల్‌ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

ట్రిపుల్‌ ఐటీ,రాయదుర్గం,ఐకియా -సాధారణ ప్రయాణం కూడా గంటల తరబడి..వాహనదారుల ఆగ్రహం

శేరిలింగంపల్లి,ఆగస్టు 30(విజయక్రాంతి): ఆదివారం ఉదయమే ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ వ్యవస్థ కుప్పకూలింది. నగరంలో నిర్వహించిన 10కే రన్‌(10K Run) నేపథ్యంలో పోలీసులు పలు ప్రధాన రహదారులను మూసివేసి వాహనాలను దారి మళ్లించడంతో మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి పరిసరాల్లో భారీ రద్దీ ఏర్పడింది.కేబుల్‌ బ్రిడ్జి, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ వద్ద వాహనాలు కిలోమీటర్ల పొడవునా బారులు తీరాయి. మాదాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌ నుంచి జూబ్లీ జంక్షన్‌ వరకు కదలిక లేకుండా పోయింది.

టెక్‌ మహీంద్రా, లెమన్‌ ట్రీ హోటల్, రాయదుర్గం మెట్రో మార్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఐకియా మీదుగా గచ్చిబౌలి స్టేడియం వైపు వెళ్లాలనుకున్నవారు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. సాధారణంగా కొన్ని నిమిషాల్లో చేరే దూరానికి ఎక్కువ సమయం పట్టిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రధాన కూడళ్ల వద్ద ఒత్తిడి పెరగడంతో అనుసంధాన రోడ్లపైనా రద్దీ విస్తరించింది

ముందస్తు సమాచారం సరిగా అందకపోవడమే అసౌకర్యానికి కారణమని వాహనదారులు ఆరోపిస్తున్నారు.ప్రజా కార్యక్రమాలు నిర్వహించడం మంచిదే అయినా, సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే పటిష్ఠమైన ట్రాఫిక్‌ ప్రణాళిక రూపొందించి, మళ్లింపుల వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పలువురు కోరుతున్నారు.రద్దీ మార్గాలు తప్పించి ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని, అత్యవసరం కాకుండా బయటకు రావద్దని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.