ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు
రసాయన ఎరువులు తీసుకోవాలంటే.. లింకుగా ఎరువులు ఇతర ఎరువులు తీసుకోవాల్సిందే..
లింక్ ఎరువులపై దృష్టి సారించిన వ్యవసాయ అధికారులు..
ఉట్నూర్, జూన్ 11 (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్లో కోటి ఆశలతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టిన రైతన్నలకు ఆదిలోనే హంస బాధపడుతుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు భూమిలో నాటేందుకు అవసరమైన రసాయన ఎరువులకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎరువులు అందుబాటులో లేవంటూ రైతులను తిప్పుకుంటున్నారు. రసాయన ఎరువులైన డి ఎ పి, యూరియా తో పాటు ఇతర ఎరువులు కావాలంటే లింకుగా మరో ఎరువులు పిచికారి మందులు తీసుకోవాలని వ్యాపారులు అంటున్నారు.
దీంతో గత్యంతరం లేక ఎరువులతో పాటు లింకుగా అందజేసే పిచికారి మందులను సైతం కొనుగోలు చేయవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రసాయన ఎరువులపై నిర్ణయించిన ధరలకంటే అదనంగా ఒక బస్తాకు 100 రూపాయల నుండి 200 రూపాయలను అదనంగా వసూలు చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు బిల్లులు ఇస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, ఉట్నూర్ మండలాల పరిధిలో విత్తనాలు ఎరువులు దుకాణాల్లో ఈ తతంగం జరుగుతున్న వ్యవసాయ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.. విత్తన దుకాణాలకు వెళ్లి రసాయన ఎరువులు అయినా డి ఏ పి, యూరియా, ఇతర ఎరువులు వ్యాపారులను అడుగుతే విత్తనాలు కొనుగోలు చేశావా.. విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లు చూపిస్తే ఎరువులు దొరుకుతాయని వ్యాపారులు అంటున్నారని రైతులు అంటున్నారు.
ఎరువులతో పాటు లింకు ఎరువులను తీసుకోవాలని వ్యాపారులు మెలక పెడుతున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు అప్పులు చేసి తీసుకువచ్చిన డబ్బులతో ఎరువులపై సరఫరా చేసే లింకు ఎరువులు పిచికారి మందులకు అదనంగా డబ్బులు చెల్లించవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఎరువుల పేరుతో దోపిడీ చేస్తున్న వ్యాపారులపై నిఘా పెంచి రైతులకు న్యాయం చేయాలంటూ రైతులు కోరుతున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన డి ఏ పి బస్తా ధర 1350 ఉంటే 1450 నుంచి 1550 రూపాయల వరకు అమ్ముతున్నారని రైతులు అంటున్నారు. యూరియా ధర 266 రూపాయలు ఉంటే బిల్లు మాత్రం ప్రభుత్వ ఆదేశాల మేరకే బిల్లువిస్తూ ఒక బస్తా యూరియాకు 320 రూపాయలు వసూలు చేస్తున్నారని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా నిఘా వర్గాలు వ్యాపారుల వ్యవహారంపై దృష్టి సారించి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పది బస్తాల యూరియాకు లింక్ పిచికారి మందు ఇచ్చారు..
ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం నుండి పది బస్తాల యూరియా కొనుగోలు చేస్తే అదనంగా 1200 రూపాయలు విలువ చేసే పిచికారి మందు అంటగట్టారని అన్నారు. డి ఏ పి, యూరియా, ఇతర ఎరువులు కొనుగోలు చేసే చేయాలంటే వ్యాపారులు ఇచ్చే లింకు పిచికారి మందులు కొనుగోలు చేయవలసి వస్తుందని అన్నారు.
ఎరువులు కొనుగోలు చేసి ఆటోలలో ఎరువులు తీసుకు వెళ్ళేందుకు తీసుకువచ్చిన డబ్బులను లింక్ ఎరువులకు చెల్లించవలసి వస్తుందని వాపోయారు. పది బస్తాల యూరియా కొరకు 1200 రూపాయల విలువ చేసే పిచికారి మందులు అంటగట్టారు. పిచికారి మందులు ఏ సమయంలో వాడాలో ఎప్పుడు వాడాలో తెలియదని రైతు అన్నారు.
దేవరావు, రైతు, గౌరాపూర్ ఇంద్రవెల్లి మండలం
ఎరువులపై లింకు విషయం నా దృష్టికి రాలేదు..
మార్కెట్లో విత్తన వ్యాపారులు ఎరువుల విక్రయంలో ఎరువులకు లింకు ఎరువుల అందిస్తున్న విషయం తన దృష్టికి రాలేదని మండల వ్యవసాయ శాఖ అధికారి గణేష్ రాథోడ్ అన్నారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నామని, తనిఖీ చేసే సమయంలో రైతులు తన దృష్టికి తీసుకురాలేదన్నారు. రసాయన ఎరువులను విక్రయించే వ్యాపారులు కృత్రిమ కొడతా సృష్టించకుండా, ఎరువులకు లింక్ ఎరువులు ఇవ్వడంపై తన దృష్టికి తీసుకురావాలని, వ్యాపారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి అన్నారు.
గణేష్ రాథోడ్, మండల వ్యవసాయ శాఖ
అధికారి, ఇంద్రవెల్లి..






