09-02-2026 12:20:20 AM
ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
మెదక్, ఫిబ్రవరి 8 (విజయ క్రాంతి) :ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు తెలిపారు. మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, రామాయంపేట్, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీలలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘాను మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు.
ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అనవసర గొడవల కు పాల్పడితే నాన్-బైలబుల్ కేసులు నమో దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. నాలుగు మున్సిపాలిటీ కేంద్రాల్లో సుమారు 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
మొత్తం 75 వార్డులకు గాను 150 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో 21 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నవారు, గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను ముందుగానే గుర్తించి, సుమారు 1206 మందిపై ముందస్తుగా బైండోవర్ చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టడం ద్వారా నేటి వరకు 2,69,000 రూపాయల నగదు, 40 కేసుల్లో సుమారు 5,23,250 రూపాయల విలువగల 557.44 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ. 3,36,000 విలువగల 336 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అలాగే రూ. 9,25,250 విలువగల ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం స్వాధీనం చేసిన వస్తువుల విలువ రూ. 20,54,660 గా ఉన్నట్లు తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘించిన వ్యక్తులపై 6 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.