6 April, 2026 | 4:53 AM

పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు

06-04-2026 02:11 AM
  1. పల్లెపల్లెనా భట్టి విక్రమార్క పాదయాత్ర

పార్టీకి, పార్టీ శ్రేణులకు ఊతం

నేడు పిప్రిలో విజయోత్సవ సభ 

హాజరుకానున్న సీఎం 

ఖమ్మం/ఆదిలాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, శ్రేణులకు నూతన ఉత్తేజం తీసుకొచ్చేందుకు సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సోమవారం నాటికి మూడేళ్లు పూర్తి చేసుకుంది. 2023 మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామం నుంచి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సాగింది. ఈ సందర్భంగా సోమవారం పిప్రిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు.

ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు. కాగా భట్టి విక్రమార్క ఎండలను, అకాల వర్షాలను లెక్కచేయడకుండా పాదయాత్ర చేశారు. ప్రజల వద్దకు వెళ్లి వారితో కలిసి నడిచి, వారు పెట్టింది తిని వారిలో ధైర్యం నింపడమే కాదు రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వమంటూ, అందరి కన్నీళ్లు తుడి చే బాధ్యత నాది అని భరోసా ఇచ్చారు. పాదయాత్ర కొనసాగిన మూడు నెలల పాటు ఆయన ఏ ఒక్క రోజు వాహనంలో ఎక్కడం కానీ నిద్రించడం కానీ చేయలేదు.

పిప్రి గ్రామంలో ప్రారంభించిన పాదయాత్ర చివరకు 2023 జూలై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ భారీ సభతో ముగిసింది. మొత్తం 109 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో భట్టి విక్రమార్క సుమారు 1,364 కిలోమీటర్లు నడిచా రు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తం 17 జిల్లాలు 36 అసెంబ్లీ నియోజకవర్గాలు దాటి ముందుకు సాగింది. ఈ యాత్రలో ఆయన 700 పైగా గ్రామాలను సందర్శించి వందకు పైగా కార్నర్ మీటింగ్లో హాజరైన అశేష జన వాహిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను వినడమే కాకుండా అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా హామీల ద్వారా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆనాడు ప్రజలకు వివరించారు. భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర తిరిగి రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీనీ అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. పాదయాత్రలో ప్రతి రోజు కలిసిన మనుషుల పేర్లు, గ్రామాల పేర్లు, సమస్యలను ప్రత్యేకంగా ఆయన డైరీలో రాసుకున్నారు.

పిప్రి గ్రామంలో సోమవారం నిర్వహించే సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజన్ పరిశీలించారు. వేసవికాలం దృష్ట్యా సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ పోలీసులు రూట్ మ్యాప్ ను సైతం నిర్ధారించి, శుభ సందర్భంగా ఏర్పాటు చేపట్టారు.

నా జన్మ ధన్యమైంది: భట్టి విక్రమార్క 

మూడేళ్ల క్రితం మండుతున్న ఎండలు ఒకవైపు, గుండెల్లో రగులుతున్న ప్రజా సమస్యల ఆవేదన మరోవైపు. నన్ను కన్న ఈ నేల రుణం తీర్చుకోవాలనే తపనతో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టాను. నాతో నడిచిన పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసిసి సెక్రెటరీ మాణిక్ రావు ఠాకూర్, ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నాను మంత్రివర్గ సభ్యులు, రాష్ట్రంలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ  పీపుల్స్ మార్చి పాదయాత్రలో నా భుజం తట్టి నన్ను నడిపించారు.  1364 కిలోమీటర్ల పాదయాత్ర తో నా జన్మధన్యమైంది.