కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింత..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య రెండోసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.
ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ నుంచి తాజాగా మూడో గీతం ‘మనసా వాచా’ విడుదలైంది. ‘చప్పుడే చేయదు వెలుతురు.. నొప్పినే చెప్పదు నెత్తురు.. వాటి రుజువునడిగేదెవ్వరూ..’ అన్న ఆలాపనతో ఆరంభమైన ఈ పాట, ‘కుశలమా అంటూ అడిగే అతడి కౌగిలింత.. కుశలమే అంటూ పలికే ఆమెలోని చింత.. మనసులో మాట అర్థమయ్యేంత చనువు ఉన్నదంట.. మనసా వాచ.. ఆ సామవేద స్వరాలతో నిను పొగిడినా గానీ చాలదు మనసా వాచ..’ అంటూ సాగుతూ సంగీత, సాహిత్య ప్రియుల హృదయాలను హత్తుకుంటోంది. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించగా.. కేఎస్ చిత్ర, ఎస్‌పీ చరణ్ ఆలపించారు. ఈ పాటలో నాయకానాయికలు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పాత్రల మధ్య ప్రేమ, అనుబంధం, వారి మనసుల్లో చోటుచేసుకునే భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.






