బల్దియాను ముక్కలు చేశారుగా.. ఎవరిని అడిగారు?
- అశాస్త్రీయంగా విభజించలేదా?
- డీలిమిటేషన్‌పై విషం చిమ్మడం దుర్మార్గం
- సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే
- జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా?
- బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న డీలిమిటేషన్‌ను ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీని ఏ ప్రాతిపదికన మూడు ముక్కలు చేశారని బీజే పీ ఎంపీ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. అసలు ఈ విభజన చేసే ముందు ఎవరితో చర్చించారు.. కనీసం ఒక్క అఖిల పక్ష సమావేశమైనా నిర్వహించారా?.. ఏ రాజకీయ పార్టీ అభిప్రాయాలను తీసుకున్నారు?.. అసెంబ్లీలోనైనా దీని పై సమగ్రమైన చర్చ జరిపారా?.. కనీ సం ప్రజల అభిప్రాయాలనైనా పరిగణలోకి తీసుకున్నారా? అని ఆయన నిలదీశారు.
‘జీహెచ్‌ఎంసీని అశాస్త్రీయంగా 300 డివిజన్లుగా విభజించ డం వెనుక ఉన్న మతలబు ఏంటి? కేవ లం మజ్లిస్ పార్టీ మెప్పు కోసం, ఆ పార్టీకి కోర్ హైదరాబాద్‌ను అప్పజెప్పాలనుకునే కుట్రలో భాగంగానే కదా మీ ఆలోచన..?. మూడు ముక్కలు చేశారు సరే.. మరి ఎక్కడైనా ఆదాయా న్ని పెంచే ఆలోచన చేశారా?,
కొన్నిచోట్ల 3 వేల ఓట్లు ఉంటే.. మరికొన్ని చోట్ల 30 వేల వరకు ఓట్లు ఉన్న డివిజన్లుగా ఇష్టారీతిన విభజించి, రాజకీయ లాభం కోసం, కేవలం మజ్లిస్ ప్రయోజనాల కోసమే జీహెచ్‌ఎంసీని ఇష్టారీతిన ముక్కలు చేసిన మీరు.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చేస్తున్న డీలిమిటేషన్‌పై విషం చిమ్మడం దుర్మార్గం’ అని ఆయన మండిపడ్డారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.
ప్రజాస్వామ్యం అంటే డబ్బే..
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాస్వామ్యం అంటే డబ్బే అని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీకి ఆయ న డబ్బుల మూటలు మోశారని, నగదు కేం ద్రంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించా రు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం తన గొం తు వినిపిస్తున్నానని, తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేశారా? అని ప్రశ్నించా రు. తుపాకీ పట్టుకొని ఆయన ఎవరి పక్కన నిలుచున్నారో అందరికీ తెలుసునన్నారు.
కాం గ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కేరళ నుంచి ఎందుకు పోటీ చేశారంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నిలదీశారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం తెలుగు వాడిగా తనకు గౌరవంగా ఉందని లక్ష్మణ్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా, ప్రస్తుతం ఉన్న సీట్ల నిష్పత్తికి అనుగుణంగా అవి పెరుగుతాయని తెలిపారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.
అందు కే డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుల పట్ల రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. జీఎస్డీపీ ప్రకారం డీలిమిటేషన్ చేయాలన్నది కాంగ్రెస్ విధానమా? అనే ది స్పష్టం చేయాలని ఆ పార్టీ నేతలను డిమాం డ్ చేశారు. ఓటు విలువ ధనిక, పేద అనే వ్యత్యాసం లేకుండా అందరికీ సమానంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. జీడీపీలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయని గుర్తుచేశారు.
మహిళల అవ కాశాలను దెబ్బతీయడానికి కుట్ర పన్నుతున్నారంటూ విపక్షాలపై లక్ష్మణ్ మండిపడ్డారు. మహిళల వాటా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారా?, ఎస్సీ, ఎస్టీ వాటా అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారా? అంటూ విపక్షాలకు ఆయన ప్రశ్నలు సంధించారు. 543లో మహి ళా రిజర్వేషన్లను పెంచమనడం అంటే ఎస్సీ, ఎస్టీ మహిళలకు నష్టం చేయాలనే కుట్రేనని అన్నారు. డబ్బున్న వాళ్లకే ఓటు విలువ ఎక్కు వ అనేలా రేవంత్ చేసిన ప్రతిపాదన హాస్యాస్పదంగా ఉంది.
జనాభాతో సంబంధం లేకుం డా నియోజకవర్గాల పెంపు జరుగుతుందని, పార్లమెంట్‌లో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 24 శాతంగా ఉంది.. నియోజకవర్గాల పెంపు తర్వాత కూడా 24 శాతం ఉంటుందన్నారు. దేశానికి ఎంతో సేవ చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ తగిన గౌరవం ఇవ్వలేదని లక్ష్మణ్ గుర్తుచేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియను ఇంకా ఆలస్యం చేస్తే 2029లో మహిళలకు వచ్చే అవకాశాలు పోతాయని, అందుకే 2011 జనాభా లెక్కల ప్రకారం తక్షణమే అమలు చేయాలని కోరా రు. రాజకీయ లాభనష్టాలు పక్కన పెట్టి, రాజ్యాంగబద్ధమైన ఈ నిర్ణయాలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఎవరు రాజ్యాంగానికి అండగా ఉంటున్నారో, ఎవరు అడ్డుపడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.






