18 March, 2026 | 5:50 PM

Breaking News

జిల్లాలో అందుబాటులో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు

18-03-2026 04:07 PM

భయాందోళనలతో ప్రజలు... గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకోవద్దు

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయక్రాంతి): జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు స్టాక్ సమృద్దిగా  అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అనవసర ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన జిల్లాలో గత రెండు రోజులలో సరాసరి కంటే  40%  అధికంగా గ్యాస్ సిలిండర్ బుకింగ్ జరిగాయని, ప్రజలు భయాందోళనలతో గ్యాస్ సిలిండర్ బుక్ చేయవద్దని కలెక్టర్ కోరారు.

3 నుంచి నాలుగు రోజుల వ్యవధిలో గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో సమృద్ధిగా గ్యాస్ సిలిండర్ల స్టాక్ అందుబాటులో ఉందని, గ్యాస్ సిలిండర్ స్టాక్ అంశాన్ని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తుందని ప్రజలు అనవసర భయాందోళనలకు గురి కావద్దని  పేర్కొన్నారు.

ఎల్పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలించి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.  జిల్లాలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి 29 సిలిండర్స్ సీజ్ చేయడం జరుగుతుందని, జిల్లాలో 15 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతుందని వాటి డెలివరీలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబరు 08728 224045ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

గృహ సంబంధిత అవసరాలకు సరఫరా చేసే ఎల్పీజీ సిలిండర్లను ప్రతి రోజు ఆర్డీఓలు, తహసీల్దార్లు, సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షిస్తున్నారని, ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని గృహ వినియోగానికి, ఆసుపత్రులకు, విద్యా సంస్థలకు, వృద్ధాశ్రమాలకు, ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్దంగా ఉందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.