ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో రాజకీయాలకు తావుండొద్దు
జిల్లా కలెక్టర్ చిత్తమిశ్రాకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతి
కరీంనగర్, జూలై 20 (విజయ క్రాంతి): కరీంనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్లు అందేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చిత్తమిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ పథకం అనేది నిరుపేదల సొంతింటి కలను నిజం చేసే కీలకమైన కార్యక్రమమని, దీనిని ఎంతో బాధ్యతాయుతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కేటాయింపు ప్రక్రియలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా, పూర్తిగా నిబంధనల ప్రకారం అర్హులైన వారికే ఇండ్లు దక్కేలా చూడాలని కలెక్టర్ను కోరారు. దాంతోపాటు గతంలో ఆరెపల్లి గ్రామంలో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో అప్పుడు ఇండ్లు కోల్పోయినవారికి అప్పటి కలెక్టర్ వారికీ డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీ మేరకు వారికీ తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి తగిన న్యాయం చేయాలన్నారు.
ముఖ్యంగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరిపి, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి వివక్ష ఉండకూడదని, రాజకీయ పార్టీలకు అతీతంగా పేదరికాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని జాబితాను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను పారదర్శకంగా వెల్లడించడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






