6 August, 2026 | 3:26 AM

ఆర్టీసీ కార్మికుల ఐక్యతే ఆయుధం

06-08-2026 12:00 AM
  1. ‘రిమూవల్‘ బెదిరింపులకు భయపడం
  2. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మహేశ్వరం, ఆగస్టు 5: మహేశ్వరం ఆర్టీసీ డిపోలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవళ్ల సమ్మయ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహేశ్వరం డిపో నూతన బీసీ కమిటీ ఆవిర్భావ కార్యక్రమంలో టీఆర్పీ చీఫ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

గతంలో ఉన్న యూనియన్ల వైఫల్యం వల్ల ఆర్టీసీ అంటేనే కష్టం అనే స్థాయికి తీసుకువచ్చారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బతకాలంటే ఎలక్షన్లు లేదా అడుక్కోవడం ద్వారా సాధ్యం కాదని, కేవలం కార్మికుల ఐక్యత ద్వారానే సంస్థను కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు. యాజమాన్యం కార్మికులను భయపెట్టడానికి వాడుతున్న ‘రిమూవల్‘ అనే పదాన్ని ఆర్టీసీ నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

రిటైర్డ్ కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా, పెన్షన్లు తగ్గిస్తూ ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొడుతోందని మల్లన్న మండిపడ్డారు. వారం రోజుల్లోగా రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహేశ్వరం డిపో ఇకపై ఒక ఆదర్శవంతమైన బీసీ యూనియన్ డిపోగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి కార్మికులపై ఎలాంటి ఒత్తిడి లేదా హింస జరిగినా తాను నేరుగా రంగంలోకి దిగుతానని, అవసరమైతే చట్టసభల్లో కూడా పోరాడుతానని హామీ ఇచ్చారు.

2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని, బీసీ ప్రభుత్వాన్ని తీసుకువస్తామన్నారు. అనంతరం మహేశ్వరం నూతన డిపో గౌరవ అధ్యక్షులుగా నియమితులైన ఇంద్రకంటి రాకేష్ గౌడ్‌ను అభినందించారు. నూతన కమిటీలో డిపో చైర్మన్‌గా జె వెంకటేష్, అధ్యక్షుడిగా కె. మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా ఏ. వెంకటేశ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్గా కృష్ణ గౌడ్, సలహాదారులుగా వి. నరసింహ, వి. జయేందర్, కోశాధికారిగా నియమితులైన ప్రతినిధితోపాటు కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.

కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియల్ ప్రధాన కార్యదర్శి పున్న హరికిషన్, బహుజన్ వర్కర్ యూనియన్ చైర్మన్ సీహెచ్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, గ్రేటర్ జోన్ గౌరవ అధ్యక్షులు, టీవీఆర్, టీఆర్పీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్కా, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీచైర్మన్ నర్సయ్యగౌడ్, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్,కార్మిక విభాగం అధ్యక్షులు కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.