ఎమ్మెల్యేల ఫిరాయింపుల రగడ
- మళ్లీ హైకోర్టు మెట్లెక్కిన బీఆర్‌ఎస్
- రెండు రోజుల్లో 9 మందిపై పిటిషన్లు
- నేడు విచారించనున్న ధర్మాసనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చిన నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ వరుసగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. రాజ్యాంగ నిబంధనలను పక్కనపెట్టి స్పీకర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ, న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరింది. సోమవారం ఏడుగురు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా..
మంగళవారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై పిటిషన్ వేసింది. మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పుడు హైకోర్టు చేతుల్లోకి చేరింది. బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల తీవ్రత దృష్ట్యా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారించనుంది.
స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతోంది.. స్టే ఇచ్చే అవకాశం ఉందా.. లేదా స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తుందా.. అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, పిటిషన్ దాఖలు చేసిన ఇద్దరు ఎమ్మెల్యేల అంశం కూడా నేటి విచారణలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.




