నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి జరపాలి
ఓబీ తొలగింపు వేగవంతం చేయాలి: సింగరేణి డైరెక్టర్ (పీపీ) వెంకటేశ్వర్లు
మంచిర్యాల, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాకు కేటాయించిన రోజు వారి ఉత్పత్తి, ఓబీ తరలింపు లక్ష్యాన్ని సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెకట్స్ అండ్ ప్లానింగ్) కే వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. నూతన ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్ణయించిన ఉత్పత్తి , ఉత్పాదకత సాధనే లక్ష్యంగా డైరెక్టర్ (పీపీ ) గురువారం ఉదయం శ్రీరాంపూర్ ఏరియా పరిధిలోని ఇందారం ఉపరితల (ఐకే ఓసీ) గనిని సందర్శించి ఐకే ఓసీలోని క్వారీ, పని ప్రదేశాలను పరిశీలించారు.
అలాగే ఓబీ తొలగింపు, బొగ్గు ఉత్పత్తి, యంత్రాల పనితీరు, ఇతరత్ర వ్యవహారాలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుత పని ప్రదేశాలలో పర్యటించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తి పెంపుపై అధికారులకు పలు సూచలను చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (పీపీ) మాట్లాడుతూ ప్రతి రోజు 1200 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 5 వేల టన్నుల ఓబీ తొలగింపు జరగాలని ఆదేశించారు.
రానున్న రోజుల్లో ఐకే ఓసీకి సంస్థ నిర్దేశించిన టార్గెట్ సాధించేలా రోజు వారి ఉత్పత్తిని పెంపొందిచుకోవాలని సూచించారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందేలా చూడాలని, రానున్న రెండు, మూడు నెలల్లో ఏరియా వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పెరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అడ్మిటెన్స్, డిస్పాచ్ జరిగేలా సిద్దంగా ఉండాలన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వెంట శ్రీరాంపూర్ ఏరియా ఇంచార్జ్ జీఎం కే రాజేందర్, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జీఎం వీరభద్రం, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, మేనేజర్ (ఆపరేషన్) శంకర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ రామకృష్ణ, రక్షణ అధికారి మహేష్, ఆఫ్ లోడింగ్ ఇంచార్జ్ రామానాయుడు, సర్వేయర్ రాంమోహన్, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులున్నారు.






