వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటం ఆగదు
- రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత్రి వెంకటేశ్
వడ్డెర సంఘం నాయకులు ముందస్తు అరెస్ట్
ఘట్ కేసర్, మార్చి 24 : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ. 10వేల కోట్లు బడ్జెట్ కెటాయించాలని రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత్రి వెంకటేశ్ డిమాండ్ చేశారు. 2023 ఎన్నికల మేనిఫెస్టోలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ యిచ్చిన ప్రభుత్వం ఆహామీని అమలు చేయడంలో నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఆ సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వడ్డెర సంఘం ఉపాధ్యక్షుడు శివరాత్రి వెంకటేశ్ తో పాటు పలువురు నాయకులను ఘట్ కేసర్ పోలీసులు ముందస్తు ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న వడ్డెర సంఘం నాయకులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాధాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
తమ హక్కుల సాధన కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టగా పోలీసులు ముందస్తు చర్యలతో నేతలను అదుపులోకి తీసుకోవడం ప్రజాసామ్య హక్కులపై దాడి అని విమర్శించారు. శివరాత్రి వెంకటేశ్ అరెస్ట్ ను వడ్డెర సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. హామీలు వెంటనే అమలు చేయాలని డీమాండ్ చేశారు. వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ముందస్తు అరెస్టు అయిన వారిలో స్థానిక నాయకులు, మహిళలు ఉన్నారు.




