31 July, 2026 | 8:20 PM

Breaking News

దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •   మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంపీడీఓ   •  

వ్యూహాత్మక ‘చికెన్ నెక్’!

24-05-2026 12:00 AM

పశ్చిమ బంగాల్‌లో నూతనంగా కొలువైన బీజేపీ సర్కార్ దేశ భద్రతకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి 600 ఎకరాలను భద్రతా దళాలకు అప్పగించిన సువేందు అధికారి ప్రభుత్వం, తాజాగా సిలిగురిలోని ‘చికెన్ నెక్ కారిడార్’పై బీఎస్‌ఎఫ్‌కు సర్వాధికారాలు కట్టబెట్టడం విశేషం. దేశ భద్రత, సరిహద్దు రక్షణ కోణంలో చూస్తే వ్యూహాత్మకమైన ఈ 120 ఎకరాల కారిడార్‌ను కేంద్ర బలగాలకు అప్పగించడాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే.

భారతదేశ భౌగోళిక నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఈ కారిడార్ కూడా ఒకటి. భారత ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలు అసోం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపుర, సిక్కింలను అనుసంధానించే ఈ ప్రాంతాన్ని ‘చికెన్ నెక్’ కారిడార్‌గా పిలుస్తారు. మన దేశ మ్యాప్‌లో ఇది కోడి మెడలా సన్నగా కనిపిస్తుండటంతోనే దీనికి ఈ పేరు వచ్చింది.

సుమారు 60 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ ప్రాంతం దేశ రక్షణ, ఈశాన్య ప్రాంతాలకు రవాణాపరంగా కీలకమైనది. ముఖ్యంగా ఆహార సరఫరా, ఇంధనం, ఔషధాలు, రక్షణ సామగ్రి అన్నింటిని ఈ ప్రాంతం ద్వారా తరలించాల్సి ఉంటుంది. ఒకవైపు నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, సమీపంలోనే భూటాన్, ఇంకోవైపు చైనాకు చెందిన చుంబీ లోయ ఉండటంతో ఇది అత్యంత సున్నిత ప్రాంతాల్లో ఒకటిగా మారడానికి మరో ప్రధాన కారణం.

కాగా, 1962 భారత్ యుద్ధం తర్వాత ఈశాన్య రాష్ట్రాల భద్రత విషయంలో ఈ కారిడార్ ప్రాధాన్యాన్ని గుర్తించిన భారత్ నాటి నుంచి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. 2017లో డోక్లాంలో చైనా రహదారి నిర్మాణానికి ప్రయత్నించగా, ఈ కారిడార్ భద్రతపై అది ప్రభావం చూపవచ్చన్న ఆందోళనలతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, వంతెనలు లాంటి మౌలిక వసతుల కల్పనపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది.

అయితే, మొన్నటివరకు ఈ కారిడార్‌పై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ ఉండటం సవాల్‌గా మారింది. కాగా, అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా పట్టాలెక్కి రక్షణ దళాల తరలింపు, బలగాల సమన్వయానికి తాజా నిర్ణయం దోహదపడుతుందని చెప్పవచ్చు. మొత్తానికి భౌగోళిక మార్గంగానే కాకుండా భారతదేశ ఐక్యతకు, భద్రతకు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కీలకమైన జీవనాడి లాంటి ఈ కారిడార్‌లో మౌలిక వసతుల కల్పన మన దేశానికి వ్యూహాత్మక అవసరమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.