18 March, 2026 | 3:36 AM

సమన్వయంతో శ్రీరామనవమి ఉత్సవాలు విజయవంతం చేయాలి

18-03-2026 12:08 AM

కలెక్టర్ అంకిత్ 

భద్రాచలం, మార్చి 17 (విజయక్రాంతి): రెవెన్యూ, పోలీసు దేవస్థానం మరియు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఉండి విఐపి లకు మరియు భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీరామనవమి ఏర్పాట్లు పూర్తి చేసి విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన ఏర్పాట్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన జిల్లా ఎస్పి రోహిత్ రాజు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఐటిడిఎ పి.ఓ రాహుల్,

శిక్షణా కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఏఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈఓ దామోదర్ రావుతో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం మరియు పట్టాభిషేకం ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామనవమి ఉత్సవాలు జిల్లా ప్రతిష్టకు భంగం కలగకుండా విఐపి లకు, పర్యాటకులకు మరియు భక్తులకు ప్రతిబింబంగా నిలిచే విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ముందస్తుగా సమగ్ర ప్రణాళికతో చర్యలు చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి భక్తులకు సురక్షిత, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ద్వారా శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పి తెలిపారు . అనంతరం మిథిలాస్ స్టేడియంలో శ్రీరామనవమి ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లను మరియు మాడవీధులను పరిశీలించి పలు సూచనలు చేశారు. సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.