10 March, 2026 | 4:23 AM

ఆడబిడ్డల ఉసురు తగులుతుంది

10-03-2026 12:00 AM

జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

  1. వెలుగుమట్ల బాధితుల పక్షాన ధర్నా 
  2. విశారదన్ మహరాజ్‌తో కలిసి ఖమ్మం జడ్పీ సెంటర్ దిగ్భంధం.. ఆందోళన
  3. కవిత, విశారదన్ సహా పలువురి అరెస్ట్
  4. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవిత సహా మహిళా నేతల అరెస్ట్
  5. ఇరువర్గాల తోపులాట, పలువురికి గాయాలు
  6. సొమ్మసిల్లి పడినపోయిన మరికొందరు
  7. పోలీసులపై మహిళా కమిషన్‌కు జాగృతి నేతల ఫిర్యాదు

ఖమ్మం, మార్చి 9 (విజయక్రాంతి): వెలుగుమట్లలో అన్యాయంగా ఇళ్లు కూల్చి నిరాశ్రయులను చేసిన ఆడబిడ్డల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ నాయకులకు తగులుతుందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలోని జెడ్పీసెంటర్ వద్ద సోమవారం ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి.

వెలుగుమట్ల బాధితుల పక్షాన సోమవారం ధర్నాకు దిగిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ సహా జాగృతి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు విస్తుపోయేలా ఉంది. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే కవిత సహా మహిళా నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో పలువురు మహిళలు గాయపడగా మరికొందరు సొమ్మసిల్లి పడిపోయారు.

దీంతో పోలీసుల తీరుపై జాగృతి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ కానిస్టేబుళ్లు లేకుండా మహిళలను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని జాగృతి నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వెలుగుమట్ల బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తూ జెడ్పీ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.

కలెక్టర్ వచ్చి బాధితులకు అదే స్థలంలో ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం ఆర్డీవో వచ్చి మాట్లాడినా స్పష్టమైన హామీ రాకపోవటంతో ఆందోళన కొనసాగించారు. దీంతో పోలీసులు ఓవరాక్షన్ కు దిగారు. జాగృతి నాయకులు, వెలుగుమట్ల బాధితులు, ధర్మ సమాజ్ పార్టీ నాయకులను దుర్భాషలాడుతూ తోసేశారు. విచక్షణరహితంగా వ్యవహరిస్తూ వారిపై బలప్రయోగం చేసి అదుపులోకి తీసుకున్నారు. 

బాధితులతో కలిసి నిరాహార దీక్ష

స్టేషన్ నుంచి విడుదలైన కవిత నేరుగా అంబేద్కర్ భవన్‌లో వెలుగుమట్ల బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత బాధితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వెలుగుమట్లలో బుల్డోజర్లతో ఇళ్లను నేలమట్టం చేసిన ప్రభుత్వానికి, నాయకులకు బాధిత మహిళల ఉసురు తగులుతుందని అన్నారు. వెలుగుమట్లలో బాధితుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు.

పరీక్షల సయమంలో పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయటం ఆవేదన కలిగించిందన్నారు. బాధితుల ఆవేదన కొంతమంది రాజకీయ నాయకులకు ఎగ్జిబిషన్ మాదిరిగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మీ ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు పాపాలు కడుక్కునే ప్రయత్నంలో బాధితులకు భోజనం పెడుతున్నారన్నారు.

వెలుగుమట్ల బాధితుల సమస్య పరిష్కారం అయ్యేవరకు వారి పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహా జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బాధితుల ఇళ్లు కూల్చిన చోటే వారికి కొత్త ఇళ్లు కట్టించాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.

రాష్ర్టంలో పేదల  మీద జులుం నడుస్తోందని, వారి ఇళ్ల మీదకు బుల్డోజర్లు పంపుతూ అన్యాయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఆ రాజ్యాంగాన్ని కూనీ చేసేలా పేదల మీదకు బుల్జోజర్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి చర్యలకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామన్నారు.