6 June, 2026 | 2:51 AM

క్వారీ మట్టికి మునుము!

06-06-2026 01:09 AM

మట్టి మాఫియా నయా దందా 

మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): మట్టి మాఫియా మరో కొత్త దందాకు తెరలేపింది. మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, బంజరాయి భూములు, మట్టి గుట్టల నుంచి ఇంతకాలం మట్టి తొలగించిన మాఫియా దందా ఇప్పుడు.. మూతపడ్డ గ్రానైట్ క్వారీల్లో మట్టిపై కన్నేశారు. జిల్లాలో కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, ఇనుగుర్తి మండలాల్లో గ్రానైట్ క్వారీల్లో బ్లాక్ గ్రానైట్ తీయడానికి అనుమతి పొందారు. అయితే చాలా చోట్ల తమకు అనుకూలమైన గ్రానైట్ లభించకపోవడంతో క్వారీలను మూసివేశారు.

ఈ క్రమంలో మట్టికి ఇటీవల డిమాండ్ పెరగడంతో మూసివేసిన క్వారీల్లో మట్టి తవ్వకాలకు తెర లేపారు. జిల్లావ్యాప్తంగా గ్రీన్ఫీల్ హైవే, ఇతర రోడ్లు, రైల్వే మూడో లైను పనుల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. దీనికి తోడు ఈ వేసవిలో నిర్మాణ పనుల్లో మట్టికి తెగ డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఇప్పటికే చెరువులు, కుంటల్లో మట్టిని తరలించుకుపోయారు. ఇష్టానుసారంగా చెరువులు, కుంటల్లో మట్టి తొలగింపులు చేపట్టి అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో చెరువులు, కుంటల ఉనికి దెబ్బతినే పరిస్థితి ఏర్పడడంతో అనేకచోట్ల గ్రామాల్లో రైతులు చెరువులో నుండి మట్టి తీయడానికి అడ్డుపడుతున్నారు. దీనితో మట్టి మాఫియా మట్టి రవాణా కోసం కొత్త దారులను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో మూతపడ్డ గ్రానైట్ క్వారీల్లో మట్టి తొలగింపుకు శ్రీకారం చుట్టారు. గ్రానైట్ క్వారీ నిర్వహణకు అనుమతి తీసుకుని వివిధ కారణాలతో రాళ్లు తీయడం నిలిపివేసిన గ్రానైట్ క్వారీల నిర్వాహకులకు కొంత రాయల్టీ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని రాళ్ళకు బదులు మట్టి తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

కేసముద్రం మండలంలో గత కొన్నేళ్ల క్రితం మూతపడ్డ గ్రానైట్ క్వారీల నుండి మట్టి తరలిస్తూ లారీకి కొంత చొప్పున గ్రానైట్ క్వారీల యజమానులకు ముట్ట చెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రానైట్ క్వారీల్లో గ్రానైట్ రాళ్లు తీయడానికి మాత్రమే అనుమతి ఉండగా, అందుకు విరుద్ధంగా మట్టి తీసుకువెళ్తున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా గ్రానైట్ క్వారీల్లో గ్రానైట్ రాళ్లు తీయడానికి మాత్రమే అనుమతి ఉంటుందని, మట్టి తీయకూడదని, ఒకవేళ మట్టి వస్తే ఆ మట్టిని గ్రానైట్ రాళ్లు తీసిన గోతిలో పోయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా మట్టి మాఫియా యదేచ్చగా భారీ యంత్రాలతో ఇష్టానుసారంగా గ్రానైట్ క్వారీల నుండి మట్టి తరలించుకుపోతున్నప్పటికీ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి గ్రానైట్ క్వారీల నుండి అక్రమంగా మట్టి రవాణా చేయకుండా అడ్డుకోవాలని కోరుతున్నారు.