16 March, 2026 | 2:48 AM

సఫారీలదే తొలి టీ ట్వంటీ

16-03-2026 12:32 AM
  1. సొంతగడ్డపై కివీస్‌కు షాక్

91 రన్స్‌కే న్యూజిలాండ్ ఆలౌట్ 

మౌంట్ మంగునూయ్, మార్చి 15: న్యూజిలాండ్ పర్యటనను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. న్యూజిలాండ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రోటీస్ 1- ఆధిక్యంలోకి వెళ్లింది. మార్‌క్రమ్, డికాక్, రబాడ, ఎంగిడి వం టి సీనియర్లు లేనిప్పటికి.. కేశవ్ మహారాజ్ సారథ్యంలో ప్రోటీస్ యువ జట్టు అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. సఫారీ బౌలర్ల దాటికి కివీస్ బ్యాటర్లు క్రీజులో నిలవలేక పో యారు.

కివీస్ బ్యాటర్లలో నీషమ్ 26 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫా రీ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు తీశారు. అయితే 92 పరుగుల లక్ష్య చేధనలో సౌతాఫ్రికా కూడా తీవ్రంగా శ్రమిం చింది. కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ సఫారీలను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఓపెనర్ కానర్ ఎస్టర్‌హైజెన్ (45) అజే యంగా నిలిచి సౌతాఫ్రికాను గెలిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 హామిల్టన్ వేదికగా ఈనెల 17న జరగనుంది.