6 March, 2026 | 11:57 AM

రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవమే

06-03-2026 02:31 AM
  1. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు వేసిన అభిషేక్ మనుసింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి 
  2. హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు 
  3. కాంగ్రెస్‌కు మద్దతుగా ఎంఐఎం ఎమ్మెల్సీలు హాజరు 
  4. స్వతంత్ర అభ్యర్థిగా మరోవ్యక్తి నామినేషన్  
  5. నేడు నామినేషన్ల పరిశీలన..
  6. స్క్రూట్నీలో తిరస్కరణకు గురవనున్న స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ 
  7. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తామన్న కాంగ్రెస్ అభ్యర్థులు

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులుగా ఆ పార్టీ సీనియర్ నేత, సిట్టింగ్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.  అసెంబ్లీ కార్యాలయంలో ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సింఘ్వీ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, వేం నరేందర్‌రెడ్డి నాలుగుసెట్లు , ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు.

ఈ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అంతకు ముందు రాజ్యసభ అభ్యర్థులు సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి గాంధీభవన్‌కు వెళ్లగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థు లు వేం నరేందర్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీ మీడియాతో మాట్లాడారు.

రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కలిపించిన పార్టీ అధిష్ఠానానికి ఇద్దరు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాజ్యసభలో పోరాడుతానని వేం నరేందర్‌రెడ్డి అన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పార్టీ అభివృద్ధి కోసం మరింత శక్తివంతంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ తరఫున రాజ్యసభకు రెండోసారి వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నానని, గాంధీభవన్ పవిత్ర స్థలమని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

రాష్ట్ర నేతలు ఇప్పటి వరకు తనకు ఇచ్చిన సహకారం భవిష్యత్తులో కూడా ఇస్తారని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందిస్తానని, రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను సభలో ప్రస్తావిస్తానని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి డైనమిక్ అని, ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు.  

ముగిసిన నామినేషన్ల ప్రక్రియ 

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. నామినేషన్ల గడువులోపు కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్లు దాఖ లు చేశారు. ఈ పోటీకి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీ దూరంగా ఉంది. దీంతో రెండు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోనుంది. స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేసినప్పటికీ.. 

ఆయన నామినేషన్ పత్రాలపై ఎమ్మెల్యేల సంతకాలు లేకపో వడంతో  తిరస్కరణకు గురికానుంది. రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థికి 10 మంది ఎమ్మె ల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి విజయానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. ఇక ఎంఐఎంకు 7 గురు, సీపీఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా  కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాయి. 

బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం వల్ల రాజ్యసభకు సరిపోను సంఖ్యాబలం లేకపోవడతో ఆ పార్టీ రాజ్యసభ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్నది. దీంతో కాంగ్రెస్ నుంచి నామినేషన్లు వేసిన అభ్యర్థిత్వాలు ఏకగ్రీవం కానున్నాయి. ఒక వేళ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేస్తే ఈ నెల 16న ఎన్నికలు జరిగేవి. ఇప్పుడు రెండు స్థానాలకు నామినేషన్లు కూడా రెండే దాఖలు కావడంతో వీరిద్దరి అభ్యర్థిత్వాలు ఏకగ్రీవం కానున్నాయి.