రోడ్డు విస్తరణ, అదనపు బస్సు కోసం వినతిపత్రాలు
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామ పాలకవర్గ సభ్యులు గ్రామ ప్రజల రాకపోకల సౌకర్యార్థం పెద్దమల్లారెడ్డి గాంధీ చౌరస్తా నుంచి హరిజనవాడ కాలనీ వరకు ఉన్న సింగిల్ రోడ్డును విస్తరించాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ రహదారిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ఒక వాహనం ఎదురైతే మరో వాహనం సుమారు 500 మీటర్ల దూరం వరకు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
అనంతరం కంచర్ల గ్రామానికి అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పును మంజూరు చేయాలని డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డిపో మేనేజర్ త్వరలోనే అదనపు బస్సు ట్రిప్పులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోల్ల అరుణస్వామి, ఉపసర్పంచ్ ఆశా రమేష్, వార్డు సభ్యులు మహేందర్, రజనీకాంత్ రెడ్డి, నరేందర్, సిద్ధయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.






