1 July, 2026 | 2:41 AM

మట్టి మాఫియా ఆగడాలు!

01-07-2026 01:05 AM
  1. జేసీబీతో తవ్వకాలు.. ట్రాక్టర్లలో తరలింపు
  2. చేగుంట మండలం పెద్దశివునూర్లో రెచ్చిపోతున్న మాఫియా
  3. అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారుల మౌనం

చేగుంట, జూన్ 30 : మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ ఆస్తులను, ప్రకృతి మూలాలను కొల్లగొడుతూ వేల లక్షల విలువైన సహజ సంపదను అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. పెద్ద శివనూర్ గ్రామంలోని ఊర చెరువు నుండి గత 10 రోజుల నుండి కొంతమంది స్వార్థపరులు, ప్రభుత్వ కాలువను వుడ్చివేసి, ప్రైవేట్ భూమి వరకు అక్రమంగా మట్టి రవాణా సాగిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్నాయనే అబద్ధపు ప్రచారంతో రోజుకు వందలాది ట్రాక్టర్లతో  మట్టిని తరలిస్తూ, లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ అక్రమ దందాపై స్థానిక శ్రేణులు తిరగబడటంతో మట్టి మాఫియా బాగోతం బట్టబయలైంది.

నిరంతరాయంగా దోపిడీ...

సాధారణంగా ప్రభుత్వ భూముల నుంచి లేదా చెరువుల నుంచి మట్టిని తరలించాలంటే  మైనింగ్, రెవెన్యూ శాఖల నిబంధనల ప్రకారం రాయల్టీ చార్జీలు ప్రభుత్వానికి చెల్లించి, ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ  ఈ దందాలో ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే, ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండానే వేల టన్నుల మట్టిని తరలిస్తూ ఈ అక్రమ వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని నొక్కేస్తూ, పచ్చని గుట్టలను బోడి గుట్టలుగా మారుస్తూ లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

రాత్రింబవళ్లు తవ్వకాలు జరుగుతున్నా...

పగలు, రాత్రి అనే తేడా లేకుండా వందలాది ట్రాక్టర్లు , జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరుపుతూ మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లెదుటే ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతుంటే బాధ్యత గల అధికారులు నిద్రపోతున్నారా? లేక అక్రమార్కులకు కొమ్ముకాసున్నారా? అని ప్రశ్నిసున్నారు. సామాన్యుడు ట్రక్టర్ పై మట్టి తరలిస్తే కేసులు పెట్టి వేధించే అధికారులు, ఇంత పెద్ద ఎత్తున చెరువులను మింగేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శిస్తున్నారు. ఇంతజరుగుతున్నా పంచాయతీ అధికారులు, రెవెన్యూ అధికారులు మౌనం వహించడం పట్ల స్థానికులు విమర్శిస్తున్నారు. 

చర్యలు తీసుకుంటాం...

అనుమతులు లేకుండా మట్టిని తరలించడం చట్టరీత్యా నేరం. ఇలాంటి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పెద్దశివునూర్ గ్రామంలో అక్రమ మట్టి రవాణా విషయంలో ఆర్.ఐని, జీపీవోను విచారణకు పంపించి చర్యలు తీసుకుంటాం.  ఇదే విషయమై జిపిఓ అధికారి శ్రీకాంత్  కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 బాలలక్ష్మీ, తహసీల్దార్ చేగుంట