వైద్యుల నిర్లక్ష్యం.. ఐదుగురు గర్భిణులకు తీవ్ర అస్వస్థత
- 10 మందిలో 5 గురికి ప్లేట్లెట్స్,కిడ్నీ, మూత్ర ఇన్ఫెక్షన్ లక్షణాలు
- నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలింపు
- విచారణ జరుపుతున్నాం... ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ వెల్లడి
బాన్సువాడ, జూలై 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శుక్ర, శనివారాల్లో వైద్యుల నిర్లక్ష్యంతో సిజేరియన్ ఆపరేషన్లు వికటించడంతో ఐదుగురు గర్భిణులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో కలకలం రేగింది. బాన్సువాడ ఏరియా ఆసుపత్రి పరిధిలోని మాతా శిశు ఆసుపత్రిలో గత శుక్ర, శనివారాల్లో మొత్తం 10 మంది గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించారు.
అయితే వారిలో ఐదుగురు మహిళల ఆరోగ్యం ఒక్కసారిగా విషమించింది. ఆపరేషన్ అనంతరం వారిలో ప్లేట్లెట్స్ అసాధారణంగా పడిపోవడం, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్, కిడ్నీల్లో సమస్యలు తలెత్తడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.విషయం తెలుసుకున్న వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్ స్పందించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు మహిళలను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అక్కడ చికిత్స అందుతోంది.
బంధువుల ఆందోళన
ఒకేసారి ఐదుగురు మహిళలు అస్వస్థతకు గురి కావడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ చేసిన వైద్యురాలు అనుభవజ్ఞురాలే అయినా ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తున్నారు. సిజేరియన్ సమయంలో ఏదైనా నిర్లక్ష్యం జరిగిందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
విచారణ జరుపుతున్నాం: డాక్టర్ విజయభాస్కర్,సూపరింటెండెంట్ బాన్సువాడ
ఈ విషయంపై విజయ క్రాంతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయభాస్కర్‌ను వివరణ కోరగా, ఐదుగురు గర్భిణులు తీవ్ర అస్వస్థతకు గురైనది వాస్తవమే. వారి ప్లేట్లెట్స్ పడిపోయాయి. ఇలా ఎందుకు జరిగిందో అనే కోణంలో విచారణ జరుపుతున్నాం. మెరుగైన వైద్యం కోసం వారిని నిజామాబాద్‌కు రిఫర్ చేశాం అని తెలిపారు. నిజాంబాద్ లో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు.






