17 May, 2026 | 3:28 AM

కమల్ కాంబో.. అందుకే కాదనుకుందా?!

17-05-2026 01:05 AM

దక్షిణాది స్టార్ బ్యూ టీ త్రిష వరుస సినిమాలతో సందడి చేస్తోంది. తాజాగా సూర్య ‘వీరభద్రుడు’లో లాయర్ ప్రీతి పాత్రలో మెప్పించింది. ఇంకా చిరంజీవికి జోడీగా త్రిష నటించిన ‘విశ్వంభర’ సినిమా రావాల్సి ఉంది. వశిష్ఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ భారీస్థాయిలో విడుదల కానుంది. ఇదిలావుంటే, త్రిషకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అగ్ర కథానాయకులు కమల్‌హసన్, రజనీకాంత్ కాంబోలో రానున్న సినిమా కోసం త్రిష ఎంపికైనట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.

దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం త్రిష భారీగా పారితోషికం తీసుకోనున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే, తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం త్రిష సినిమాల ఎంపికల్లోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంట్లో భాగంగానే కమల్ కాంబో సినిమా కోసం ఏకంగా రూ.12 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ ఇందులో నటించేందుకు త్రిష సుముఖత వ్యక్తం చేయలేదని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

కమల్‌హాసన్, రజనీకాంత్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి నెలకొంది. వీరి స్థాయికి తగినట్లే అగ్రకథానాయికను ఎంపిక చేయాలని టీమ్ త్రిషను తీసుకోనుందని, ఇందుకోసం భారీ పారితోషికం ఆఫర్ చేసిందని టాక్. అయితే, ఈ ఆఫర్‌ను త్రిష రిజెక్ట్ చేయడం వెనుక బలమైన కారణం ఉందట. ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ నిర్మాణసంస్థ నిర్మిస్తుండటంతో త్రిష ఇందులో నటించేందుకు తిరస్కరించిందని పేర్కొంది ఆంగ్ల మీడియా. అసలు త్రిష ఈ సినిమాలో నటిస్తోందా.. లేదా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే!