దక్షిణ కాశీ కాళేశ్వరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్‌పూర్ మండలంలో వెలసిన అత్యంత ప్రాచీన, పవిత్ర శైవక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం. మహానది గోదావరి ప్రాణహిత నదుల సంగమ స్థలంలో విరాజిల్లుతోన్న ఈ క్షేత్రం.. దక్షిణ త్రివేణి సంగమం, దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచింది. పురాణ ప్రాశస్త్యం, చరిత్రం, శిల్పకళల సమ్మేళనంగా ప్రసిద్ధిగాంచింది. చారిత్రక ప్రాంతాలకు సమీపంలో ఉన్న కాళేశ్వరం.. భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది.
దట్టమైన అటవీ ప్రాంతం నడుమ.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉన్న కాళేశ్వరం భౌగోళికంగా, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి గాంచింది. హైదరాబాద్‌కు 277 కి.మీ, భూపాలపల్లికి 53 కి.మీ దూరంలో కొలువైన ఈ లయానికి చేరుకోవడానికి అనువైన రహదారులు, రైల్వే మార్గాలు, సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లు ఉన్నాయి.
ప్రాశస్త్యం
స్కంద పురాణం ప్రకారం యమధర్మరాజు (కాలుడు) ఈ క్షేత్రంలో పరమశివుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేస్తా డు. ఆయన భక్తికి ప్రసన్నుడైన పరమశివుడు తనతో పాటు నిత్యం ఇక్కడే నివసించే వరాన్ని యమునికి అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రంలో ఒకే పానవట్టంపై కాళేశ్వర, ముక్తీశ్వర అనే రెండు శివలింగా లు ప్రతిష్ఠించబడ్డాయి. దీంతో స్వామి వారిని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరుడిగా ఆరాధిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో యమధర్మరాజు శివలింగ రూపంలో పరమశివునితో కలిసి ఆరాధిం చబడుతున్న ఏకైక ఆలయం ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. కాలుడు అనే పేరుతో యముడు ఇక్కడ లింగరూపంలో కొలువై ఉండటంతో ఈ క్షేత్రానికి కాళేశ్వరం అనే పేరు వచ్చిందని ప్రతీతి. ఇక్కడి శివలింగాల్లో ఒకదానిపై రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని స్వామివారి ‘నాసికా రంధ్రాలు’గా భావిస్తారు. ఈ రంధ్రాల్లో పోసిన పాలు లేదా నీరు గోదావరిలో కలుస్తాయని విశ్వాసం.
కాళేశ్వరానికి హిందూ పురాణాల్లో విశిష్ట స్థానం
కాళేశ్వరానికి హిందూ పురాణాల్లో విశిష్టమైన స్థానం ఉంది. స్కంద పురాణంలోని కాళేశ్వర ఖండం ఈ పుణ్యక్షేత్ర మహిమను, పవిత్రతను విశదీకరిస్తుంది. పురాణాల ప్రకా రం త్రేతాయుగంలో శ్రీరాముడు దండకారణ్యంలో వనవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నట్లు రామాయణం పేర్కొంటుంది. ఇక్కడ ఉన్న ప్రాచీన శ్రీరామాలయాలు ఆ విశ్వాసాన్ని మరింత బలపరుస్తున్నాయి.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామిగా భక్తులకు దర్శనం
గోదావరి నది ఎడమ తీరంలో, గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలో వెలసిన కాళేశ్వర క్షేత్రంలో పరమశివుడు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా (భూగర్భంలో) ప్రవహిస్తుందని పురాణాలు చెబుతు న్నాయి. అందువల్ల ఈ ప్రాంతాన్ని గోదావరి, ప్రాణహిత, సరస్వతి సంగమంగా, దక్షిణ త్రివేణి సంగమంగా, దక్షిణ కాశీగా పిలుస్తారు.
అష్ట తీర్థాలుగా స్నానఘట్టాలు
కాళేశ్వరం పవిత్ర స్నాన ఘట్టాలకు కూడా ప్రసిద్ధి. అష్ట తీర్థాలుగా ప్రసిద్ధిగాంచిన బ్రహ్మ తీర్థం, పిచ్చుక తీర్థం, జ్ఞాన తీర్థం, వాయస తీర్థం, సంగమ తీర్థం, నరసింహ తీర్థం, హనుమత్ తీర్థం, వ్యాస తీర్థాల్లో స్నానమాచరించడం వల్ల పాప విమోచనం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే హిందూ పండుగల సందర్భంగా.. ముఖ్యంగా కార్తీకమాసం, మహాశివరాత్రికి ఈ స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా..
గోదావరి నది దక్షిణ తీరంలోని ధర్మపురి, కోటిలింగాల, మంథని వంటి చారిత్రక ప్రాంతాలకు సమీపంలో ఉన్న కాళేశ్వరం.. భక్తులు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఆధ్యా త్మిక, పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. ఆధ్యాత్మికత, పురాణ ప్రాశస్త్యం, చరిత్ర, శిల్పకళ, ప్రకృతి సౌందర్యాల సమ్మేళనంగా నిలుస్తున్న కాళేశ్వరం.. దక్షిణ కాశీగా విరాజిల్లుతూ నిత్యం వేలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ప్రత్యేక ఆకర్షణగా శిల్పకళ
కాళేశ్వరం శిల్పకళా సంపదకు కూడా ప్రసిద్ధి. ఈ శిల్పాలు రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలాలకు చెందినవిగా భావించబడుతున్నాయి. విజయనగర సామ్రా జ్యానికి చెందిన దేవరాయలు కాళేశ్వరంలో దిగ్విజయోత్సవం నిర్వహించి తులాపురుష దానం చేసినట్లు 1397 శాసనం వెల్లడిస్తోంది. ఎర్రరాయి, గ్రానైట్, బసాల్ట్ రాళ్లతో చెక్కబడిన ఈ శిల్పాలను ఆలయ సమీపంలోని మ్యూజియంలో భక్తులు, సందర్శకుల కోసం ప్రదర్శిస్తున్నారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ ప్రాచీనత, శివలింగాల పవిత్రతను కాపాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1976లో ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించింది. ఆ తరువాత 1982లో కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య స్వాములు ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేశారు.
బండి సంపత్ కుమార్
(కాళేశ్వరం, విజయక్రాంతి)






