రైల్వే కీ మెన్ నిజాయితీ..
ఐ ఫోన్, 20 వేల నగదు ప్రయాణికుడికి అందజేత
ఉద్యోగిని అభినందించిన పలువురు
మహబూబాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): రైల్వే ట్రాక్ పరిశీలన విధులు నిర్వహిస్తున్న కీ మెన్ కు 20 వేల రూపాయల నగదు, ఐ ఫోన్, పాస్ పోర్ట్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ లభించింది. దీంతో కీ మెన్ ఆ బ్యాగ్ ను ఆర్పీఎఫ్ ఎస్ ఐ సుభానికి అందించి, తద్వారా బ్యాగ్ పోగొట్టుకున్న నేపాల్ ప్రయాణికుడికి అందించిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
రైల్వే కీ మెన్ పాశం వంశీ శుక్రవారం మహబూబాబాద్ నుంచి తాళ్లపూస పల్లి స్టేషన్ల మధ్య ట్రాక్ పరిశీలన కోసం వెళుతుండగా తమిళనాడు ఎక్స్ ప్రెస్ రైలు నుంచి ఓ బ్యాగ్ ట్రాక్ పక్కన పడిపోవడం గమనించాడు. ఆ బ్యాగ్ ను తీసుకువెళ్లి మహబూబాబాద్ ఆర్పీఎఫ్ ఎస్ ఐ సుభాని కి అందజేయగా, బ్యాగ్ తెరిచి అందులో లభించిన పాస్ పోర్ట్ ఆధారంగా బ్యాగ్ పోగొట్టుకున్న బాధితుడికి సమాచారం ఇచ్చి అతనికి అందజేశారు. బ్యాగ్ లో 20 వేల రూపాయల నగదు, విలువైన ఐ ఫోన్‌ను బాధితునికి అందజేసిన కీ మెన్ వంశీ నిజాయితీనీ అభినందించారు.






