ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చర్లలో రూ. 10.70 కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
చర్ల, మార్చి 1, (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముం దుకు సాగుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఆదివారం రూ 10.70 కోట్ల వ్యయంతో నూతన 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీవో రాహుల్, తో కలిసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.స్టేట్ గవర్నమెంట్ ఫండ్ నిధులతో ఈ అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. శంకుస్థాపన అనంతరం ఆసుపత్రిలో అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులను, సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను కొనియాడుతూ, వారికి ప్రభుత్వం తరపున ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, చర్ల మండలంలోని మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు.
వైద్యులు, సిబ్బంది చేస్తున్న కృషి గర్వించదగ్గదని, భవిష్యత్తులో ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా నాణ్యమైన చికిత్స అందించాలని మంత్రి ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు.
కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ..
ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల ప్రజలకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు స్థానికంగానే లభిస్తాయని ఆయన అన్నారు.
ఈ నూతన భవనం అందుబాటులోకి వస్తే స్థానిక గిరిజనులకు, ప్రజలకు వైద్య పరంగా పెద్ద ఊరట లభిస్తుందని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి.సి.హెచ్.ఓ రవి బాబు, స్థానిక సర్పంచ్ పూజారి సామ్రాజ్యంఈ అన్ని శాఖల జిల్లా అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.




