12 May, 2026 | 2:58 AM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

12-05-2026 12:38 AM

శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం

కొత్తగూడెం, మే 11, (విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి నియోజకవర్గంలోనే ఒక ఆదర్శవంతమైన విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.

సోమవారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేయడంలో ప్రభుత్వ కళాశాలల పాత్ర కీలకమని, విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

కళాశాలలో అకడమిక్ ప్రణాళికలు, విద్యార్థుల హాజరు శాతం, ల్యాబ్, లైబ్రరీ వసతులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. అధ్యాపకులు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా నిలవాలని కోరారు. కళాశాల భవన మరమ్మతులు, అదనపు గదుల, సిబ్బంది కొరత, విద్యా పరికరాలు వంటి అంశాలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన విద్యా బోధనతో కళాశాల ప్రతిష్టను పెంచాలని ఆయన సిబ్బందికి సూచించారు.