04-02-2026 01:05:16 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఖరారయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఎన్నికల ప్రచారం నేటి నుంచి మరింత జోరందుకోనుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులు అధికారికంగా బరిలో నిలిచారు.
మొత్తం 20 వార్డులు ఉన్న ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ మాత్రమే అన్ని వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ ఒక వార్డులో, బీజేపీ రెండు వార్డుల్లో, జనసేన 12 వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టలేకపోయింది. దీంతో ప్రధాన పార్టీలకు అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా అన్ని పార్టీలు తమ అభ్యర్థులకు బీ-ఫామ్లను అందజేశాయి.
ఎమ్మెల్యే కోవలక్ష్మి తనయుడు కోవా సాయినాథ్ స్థానిక కేస్లాపూర్ ఆంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం పార్టీ కార్యాలయం లో అభ్యర్థులకు బీ-ఫామ్లను అందజేశారు. డీసీసీ అధ్యక్షురాలు సుగుణ కాంగ్రెస్ అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేయగా, జనసేన జిల్లా అడహాక్ కమిటీ సభ్యుడు వినీత్ తమ అభ్యర్థులకు బీ-ఫామ్లను అందజేశారు. సీపీఎం అభ్యర్థులకు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దినకర్ బీ-ఫామ్లు అందజేశారు.