18 May, 2026 | 1:08 AM

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సన్మానించిన కలెక్టర్

18-05-2026 12:12 AM

పురస్కారాలు అందజేసిన కలెక్టర్ బి. చంద్రశేఖర్

చిట్యాల, మే 17 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘ప్రత్యేక విద్యా వారోత్సవాలు’ ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాలు మరియు క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బి . చంద్రశేఖర్ సన్మానించి నగదు పురస్కారాలు అందజేశారు.

ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో చిట్యాల మండలం చిన్నకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని హెచ్. శ్రీవిద్య జిల్లా స్థాయిలో ద్వితీయ టాపర్గా నిలిచి ప్రతిభ చాటింది. ఆమెకు కలెక్టర్ పది వేల రూపాయల నగదు పురస్కారంతో పాటు శాలువా, మెమెంటో అందించి అభినందించారు. అలాగే త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలాలో జరిగిన జాతీయ స్థాయి యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బొల్లం నితీష్ కుమార్, రొండి శరత్లను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సత్కరించారు.

వారిద్దరికీ చెరో ఐదు వేల రూపాయల నగదు పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్, జిల్లా విద్యాశాఖాధికారి బొల్లారం బిక్షపతి విద్యార్థులను అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.