2 August, 2026 | 12:44 PM

సికింద్రాబాద్ లష్కర్ బోనాలు.. తొలి బోనం సమర్పించిన పొన్నం ప్రభాకర్

02-08-2026 11:23 AM

హైదరాబాద్: సికింద్రాబాద్‌ లష్కర్ బోనాలు(Secunderabad Laskar Bonalu) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చి, అమ్మవారికి బోనం(SecunderabadBonalu) సమర్పించారు. తెల్లవారుజామునే భక్తులు ఆలయానికి పోటెత్తారు. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించి, ఈ ఏడాది ఉత్సవాల ప్రారంభానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... తెలంగాణ సంప్రదాయాలకు సంస్కృతి ఆచారాలకు ఆషాఢ మాస బోనాలు ఒక ప్రతీక అన్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా శ్రీ ఉజ్జయిని అమ్మవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana) పక్షాన బంగారు బోనం పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. అమ్మవారిని ప్రభుత్వం పక్షాన రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఎవరి వృత్తుల్లో వారు విజయం సాధించాలని తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండాలని మంత్రి పొన్నం ప్రార్థించారు.

ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్భంగా సికింద్రాబాద్ బోనాల జాతరకు భక్తుల రద్దీ కూడా పెరుగుతోందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో అనేక విపత్తులు వచ్చిన అమ్మవారు ఆదుకున్నారని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. ఇప్పుడు కూడా ఎల్ నినో విపత్తు వచ్చినా.. ఇలాంటి ఇబ్బందులు కలగవద్దని బోనాల ఉత్సవాల సందర్భంగా అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారని పేర్కొన్నారు.  మాకు విశ్వాసం ఉంది ప్రకృతి వైపరీత్యం వచ్చినా తెలంగాణ పై అమ్మవారి ఆశీర్వాదంతో మంచి వర్షాలు కురిపించాలని అమ్మవారిని వేడుకుంటూ బోనాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు.