17 May, 2026 | 2:38 AM

ఇందిరమ్మకు కేంద్రం వాటా రావాలి

17-05-2026 12:00 AM
  1. ఒక్కో ఇంటికి రూ.1.13 లక్షలు ఇవ్వాలి
  2. మార్చి నుంచి ఎదురుచూస్తున్నాం
  3.   2న ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత మంజూరు
  4. ఈనెల చివరిలోగా భూముల ధరల సవరణ
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి):- రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా రావలసిన నిధుల కోసం ఈ ఏడాది మార్చి నుంచి ఎదురుచూస్తున్నామని రెవె న్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి సుమారు రూ.1.13 లక్షల వాటా విడుదల చేయాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధుల వస్తాయన్న నమ్మకంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఫైనల్ బిల్ ఆపామని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఇప్పటి వరకు కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదన్నారు. అయితే ఒకే స్థలంలో అన్నదమ్ములు వన్‌ప్లస్ వన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. అలాగే అటవీ భూముల సరిహద్దులకు శాశ్వాత పరిష్కారం చూపనున్నట్లు పేర్కొన్నారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి పొంగులేటి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాను కూడా పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఒకవేళ కేంద్రం 15 రోజుల్లోగా విడుదల చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారులకు నిధులు అందజేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తొలివిడత మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా, ఇప్పటీ వరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యా యని, జూన్ నెలాఖరుకల్లా 68-72 వేల ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తవుతుందన్నారు.

రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. గత ప్రభుత్వహయాంలో అసంపూర్తిగా ఉండిపోయిన 2బీహెచ్‌కే ఇండ్లకు సంబంధించి పాతరేట్లతో పూర్తి చేసేలా కాంట్రాక్టర్లను కోరామన్నారు. ‘హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటూ రోజూ సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేని పేదలకు వారు ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మూడు కార్పొ రేషన్లలో పేదలకు ఇండ్ల సౌకర్యం కల్పిస్తామని, ఒకే స్థలంలో అన్నదమ్ములు ఇందిర మ్మ ఇండ్లను వన్ ప్లస్ వన్ పద్ధతిలో కట్టుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 40- -50 ఏళ్ల క్రితం కట్టిన వాంబే, ఎన్‌ఆర్‌జేఎఎంఎస్ తదితర కాలనీల్లో ఇండ్లు కూలి పోయేస్థితికి చేరుకుంటున్నాయని, వాటి స్థానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూ రు చేసేందుకు పరిశీలిస్తున్నాం.

ఎదురవుతున్న సమస్యలపై సమగ్రనివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామని పేర్కొన్నారు. కబ్జాదారులను, ప్రభుత్వ భూమిని వదిలే ప్రసక్తే లేదని, అవసరమైన చోట ప్రభుత్వ భూములకు ప్రహరీతో రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, అటవీ భూముల సరిహద్దులను రోవర్ల సాయంతో కచ్చితంగా ఖరారు చేసేలా అధికారులను ఆదేశింశామని చెప్పారు. రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల నుంచి రెవెన్యూ ఫారెస్ట్ మధ్య భూ సరిహద్దు వివాదాలను జయింట్ సర్వే నిర్వహించి శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు.

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను గుర్తించి సమగ్ర సర్వే కార్యక్రమం చేపడతామన్నారు. రిజిస్ట్రేషన్ల సమయంలో సర్వర్ల డౌన్ అంశంపై దృష్టి సారించి కొత్త సాఫ్ట్ వేర్ ఏర్పాటుకు టెండర్లు పిలిచామని, రూ.14.08 కోట్లతో టెండర్ ఖరారైందని, మరో 3-4 నెలల్లో ఈ సమస్య తీరుతుందన్నారు. రాష్ట్రంలో భూముల ధరలను ఈనెల చివరిలోగా సవరిస్తామని మంత్రి వెల్లడించారు.