ప్రజా వ్యతిరేక పాలకులపై తిరగబడాలి
పోడు సాగుదారులపై దాడులను ప్రతిఘటించాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే షాబీర్ పాషా
కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య
టేకులపల్లి, (విజయక్రాంతి): ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పాలకులపై ప్రజలు తిరగబడాలని సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కే షాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు సెంటర్‌లో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఐదవ రోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈనెల 6న పినపాక నియోజకవర్గంలోని బయ్యారం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రజా చైతన్య యాత్ర సోమవారం టేకులపల్లి మండల కేంద్రానికి చేరుకుందని తెలిపారు.
జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఆగస్టు 6 నుంచి 14 వరకు ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పారు. పోడు సాగుదారులపై దాడులు, దౌర్జన్యాలను అడ్డుకోవాలి అని ఆయన అన్నారు. టేకులపల్లి ప్రాంతంలో నూతన బొగ్గు భూగర్భ గనులను ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రజా చైతన్య యాత్ర టేకులపల్లి నుంచి సీతారాంపురం, కారుకొండ, హేమచంద్రపురం, ఎదురుగడ్డ మీదుగా కొత్తగూడెం పట్టణానికి చేరుకుంటుందని షాబీర్ పాషా తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే కనకయ్య విమర్శలు
ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. పలువురు నాయకుల పాల్గొనడం కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడే గణేష్, యాదవ సంఘం రాష్ట్ర నాయకులు మచ్చ శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్. పుల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాస్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, టేకులపల్లి మండల కార్యదర్శి గుగులోత్ రామ్‌చందర్, సహాయ కార్యదర్శి నాగార్జునచారి, డేగల రమేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు గుగులోత్ సోనీ, కార్యదర్శి జయమ్మతో పాటు మండల నాయకులు రవీందర్, లక్ష్మణ్, మధు, నరేందర్, యువరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగి, శ్యాంబాబు, లాలు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






