అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్
- ఉద్యోగాలు వచ్చిన వారికంటే రాని వారేఎక్కువ
- కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణ ఉత్తమం
- పరీక్షల నిర్వహణలో అనేక సంస్కరణలు తెస్తున్నాం
హైదరాబాద్: మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం(TGPSC Chairman Burra Venkatesham) తెలిపారు. సోమవారం బుర్రా వెంకటేశం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఉద్యోగాలు వచ్చిన వారి కంటే రాని వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇకపై 2,3 నెలలకోసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. మాది చాలా క్లిష్టమైన ఉద్యోగం.. అందరినీ మెప్పించడం సాధ్యం కాదని వెల్లడించారు.
TGPSCపై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. ఓఎంఆర్ పద్దతిలో పరీక్ష నిర్వహణ క్లిష్టమైందన్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో గంట ముందు కూడా పశ్నాపత్రం రూపొందించవచ్చని వివరించారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్షల నిర్వహణ దిశగా వెళ్తున్నామని చెప్పారు. పరీక్షల నిర్వహణలో అనేక సంస్కరణలు తెస్తున్నామన్నారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు మార్కులు తెలిసే అవకాశముందని, కంప్యూటర్ బేస్డ్ పరీక్షల(Computer-Based Examination) నిర్వహణ ఉత్తమమైందని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.
రేపు 3 నోటిఫికేషన్లు విడుదల
అభ్యర్థులు కంప్యూటర్ బేస్డ్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని టీజీపీఎస్సీ చైర్మన్ సూచించారు. ఇకపై సాధ్యమైనంత వరకు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ గానే ఉంటాయన్నారు. ప్రతినెల 2,3 నోటిఫికేషన్లు ఇస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించారు. రేపు 3నోటిఫికేషన్లు విడుదల చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది, ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కు ఖాళీలు ఉన్నాయి. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు ఇస్తామని వివరించారు. 3800 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చినట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయని స్పష్టం చేశారు.






