మహారాష్ట్రకు తెలంగాణ మద్యం
ఆటోలు, జీపుల ద్వారా సరఫరా
చోద్యం చూస్తున్న అధికారులు
మంచిర్యాల, జూన్ 9 (విజయక్రాంతి): తెలంగాణ మద్యం సమీప మహారాష్ట్రకు ప్రతి రోజు పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు... మంచిర్యాల సమీపాన ఉన్న మహారాష్ట్రలోని పలు గ్రామాలకు ఈ మద్యంను సరఫరా చేస్తున్నారు. ఇంతకు ముందు నిజామాబాద్ - ఛత్తీస్ ఘడ్ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు సమీపాన ఉన్న మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లక్ష్మీపూర్, దేవులవాడ తదితర గ్రామ శివారులలో అనధికారికంగా డాబాలు నడిపించేవారు.
సమీప మద్యం దుకాణాల నుంచి ప్రతి బాటిల్ కు రూ. 5 అధికంగా చెల్లించి దాబాలకు తీసుకువచ్చి మరో పది రూపాయలు లాభం తీసుకొని అమ్మకాలు జరిపేవారు. ప్రతి రోజు సుమారు ఐదు లక్షల వరకు మద్యం విక్రయాలు జరిపేవారు. ఈ దాబాలకు పెద్ద మొత్తంలో మహారాష్ట్ర వాసులు వచ్చి మద్యం సేవించే వారు. ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ఇటీవల పోలీసులు దాబాలను మూసివేయించారు.
ఆటోలు, జీపుల ద్వారా మహారాష్ట్రకు సరఫరా..
జిల్లాలోని మద్యం దుకాణాల నుంచి సమీప బెల్ట్ షాపులకు ప్రతి రోజు మద్యం అమ్మకాలు జరుపడం సర్వసాధారణమే కాగా మహారాష్ట్ర సమీపాన వెలిసిన దాబాలు మూత పడటంతో పెద్ద మొత్తంలో వాహనాల ద్వారా మద్యాన్ని జిల్లా దాటిస్తున్నారు. అది కూడా ఎక్సైజ్ అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతుండటం విశేషం. ప్రతి రోజు ఆటోలు, జీపులలో ఎంఆర్పీ ధర కంటే పది నుంచి రూ. 20 అధికంగా చెల్లించి తీసుకొని వెళ్లి బెల్ట్ షాపుల్లోనైతే రూ. 70 నుంచి రూ. 150లకు అమ్ముతుంటే, మహారాష్ట్రలోనైతే రూ. 100 నుంచి రూ. 200 అధికానికి విక్రయాలు జరుపుతున్నారు.
బీర్లైతే ఏకంగా రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో బీరుకు రూ. 300 నుంచి రూ. 350 (లైట్, స్ట్రాంగ్)లకు అమ్మకాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని మహారాష్ట్ర బార్డర్ గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో రూ. 230 నుంచి రూ. 250లకు అమ్ముతున్నారు. మద్యం దుకాణ వ్యాపారులే ఏజెంట్లను పెట్టుకొని విక్రయిస్తున్నారంటే ఎంత మేర జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందాను మేనేజ్ చేయడానికి మండలానికి ఒకరు బాధ్యత తీసుకొని ఎక్సైజ్, పోలీసు, ఇతర విభాగాల అధికారులకు ఆమ్యామ్యాలు అప్పగిస్తూ వారి అక్రమ దందాను మూడు పువ్వులు, ముప్పు కాయలుగా నిర్వహిస్తున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు..
మంచిర్యాల జిల్లా మహారాష్ట్ర బార్డర్ మండలాల్లోని వైన్ షాపుల నుంచి పెద్ద మొత్తంలో మద్యం రాష్ట్రం దాటిపోతున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ దందా అంతా వారికి తెలిసే జరుగుతుందని, ఇందులో సంబంధిత శాఖ అధికారులకు సైతం వాటా వెలుతుందని, మాపై ఎలాంటి చర్యలుండవని మద్యం దుకాణ యజమానులు, ప్రతి రోజు మద్యం బెల్ట్ షాపులకు, పక్క రాష్ట్రానికి తరలించే వారు పేర్కొనడం గమనార్హం. ఆమ్యాయ్యాలు జేబుల్లో నింపుకొని కండ్లు మూసుకునే అధికారులుంటే ఇలాంటి అక్రమాలు జరుగుతూనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహమే లేదు. అక్రమార్కులు సైతం ఏ కోణాన భయపడకుండా వారి దందాను యథేచ్ఛగా నెరపుతున్నారు.
పొంతనలేని సమాధానాలు..
చెన్నూర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని పలు వైన్ షాపుల నుంచి మద్యం అక్రమంగా తరలుతుందని ‘విజయక్రాంతి’ చెన్నూర్ ఎక్సైజ్ సీఐని సంప్రదించగా వైన్ షాపుల నుంచి మద్యం తరలిస్తున్నట్లు ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదని సమాధానం ఇచ్చారు. అధికారులకు సమాచారం అందించేంత వరకు మద్యం బెల్ట్ షాపులకు తరలివెలుతుంది తెలియదంట..! విడ్డూరంగా ఉంది... ప్రస్తుతం (మంగళ వారం) ఎక్సైజ్ ఎస్త్స్ర నెన్నెల మండలంలో ఉన్నారని, వచ్చాక కోటపల్లి మండలంలోని వైన్ షాపుల వద్దకు పంపిస్తాననడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికైనా అధికారులు బెల్ట్ షాపులకు, ఇతర రాష్ట్రాలకు మద్యం తరలించడాన్ని ఏ మేరకు నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే.






