వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి
నస్పూర్, (విజయక్రాంతి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం - 2026 కార్యక్రమంలో భాగంగా కేటాయించిన లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర మంత్రి ఛాంబర్ నుంచి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్ తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులతో వనమహోత్సవం- 2026 లక్ష్యసాధనపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. భావితరాలకు సమతుల్య వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం లక్ష్యాలను పూర్తి చేయడం జరిగిందని, కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో వనమహోత్సవం- 2026లో భాగంగా 41 లక్షల మొక్కలను లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 27 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, నిర్ణీత గడువులోగా 100 శాతం లక్ష్యాలను సాధించే దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు






