'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
పాకిస్థాన్‌కు భారత్ మరో గట్టి హెచ్చరిక
టచ్ చేసి చూడు, పాకిస్థాన్ ముక్కలే
పాక్ రక్షణమంత్రి ప్రగల్భాలకు రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్
న్యూఢిల్లీ: పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్(Khawaja Asif) వ్యాఖ్యలకు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్(Rajnath Singh warning) ఇచ్చారు. కోల్‌కతాపై దాడికి సంబంధించి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలను రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తిప్పికొట్టారు. 55 ఏళ్ల క్రితం పాకిస్థాన్ రెండు ముక్కలయ్యిందని గుర్తుచేశారు. మళ్లీ భారత్ జోలికి వస్తే పాక్ ఎన్ని ముక్కలవుతుందో దేవుడికే తెలియాలన్నారు. "పాకిస్తాన్ రక్షణ మంత్రి అటువంటి రెచ్చగొట్టే ప్రకటన చేసి ఉండకూడదు.
55 ఏళ్ల క్రితం, పాకిస్తాన్ రెండు భాగాలుగా విడిపోయినప్పుడు వారు దాని పర్యవసానాలను అనుభవించారు. ఒకవేళ వారు బెంగాల్‌పై దుర్దృష్టి సారించడానికి ప్రయత్నిస్తే, ఈసారి పాకిస్తాన్ ఎన్ని భాగాలుగా విడిపోతుందో ఆ దేవుడికే తెలియాలి," అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భవిష్యత్తులో భారతదేశం ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే, కోల్‌కతాపై దాడి చేసి ఇస్లామాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అన్నారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కోల్‌కతాపై దాడి చేస్తామంటూ బహిరంగంగా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెదిరింపును ఖండించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధైర్యం చాలలేదని ఆరోపిస్తూ, ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సోమవారం వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.




