9 July, 2026 | 11:10 PM

11న కొలువుతీరునున్న నూతన పాలకమండలి

09-07-2026 04:29 PM

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి ముఖం మండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవం

దేవస్థానం ఈవో భవాని శంకర్

యాదగిరిగుట్ట,జూలై 9(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టశ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy) వారి దేవస్థానంకు నూతన పాలకమండలిని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈనెల 11 శనివారం ఉదయం 11 : 37 నిమిషాలకు దేవస్థానం ప్రధాన ఆలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో ప్రమాణ స్వీకారోత్సవము నిర్వహించడం జరుగుతుందని దేవస్థానం ఈవో భవాని శంకర్ తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  యాదగిరిగుట్ట దేవస్థానం కు 2007 నుండి 2009 వరకు పాలకమండలి ఉన్నదని, 17 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం జీవో 392 ద్వారా రెండు సంవత్సరాల కాల పరిమితికి స్వయం ప్రతిపత్తి కలిగిన నూతన పాలక మండలి ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దేవస్థానమును టీటీడీ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని, భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన దర్శనాలు అయ్యేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

శనివారం రోజున ప్రమాణ స్వీకారోత్సవానికి వీ,వీఐపీల తాకిడి అధికంగా ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు  తెలిపారు. దేవస్థానం నూతన పాలకమండలి సభ్యులు, యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి చైర్మన్ గా ఎం. సత్యనారాయణ రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, చిలప్ప గారి విజయ రాజం(Chilappagari Vijayarajam), తూళ్ళ విజయేందర్, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండా మల్లయ్య, స్వాతి కంఠమణి, ఎం రాఘవేందర్, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, వ్యవస్థాపక ధర్మకర్త బి నరసింహమూర్తి. ఎక్స్ అఫీషియో సభ్యులు... రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, వై టి డి ఏ ఉపాధ్యక్షులు జి కిషన్ రావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె భవాని శంకర్, దేవస్థానం ప్రధాన అర్చకులు కె వెంకటాచార్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం  ప్రెసిడెన్షియల్ సూట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నందు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.