9 May, 2026 | 3:35 AM

మమతకు సవాల్‌గా సువేందు

09-05-2026 01:34 AM

కోల్‌కతా, మే 8: పశ్చిమ బంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారి చరిత్రకెక్కనున్నారు. 1970 డిసెంబర్ 15న పశ్చిమ బంగాల్‌లోని తూర్పు మేదినిపూర్ జిల్లా కర్కూలీలో శిశిర్, గాయత్రి అధికారి దంపతులకు సువేందు అధికారి జన్మించారు. ఆ యనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. ఈయన తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాం లో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

ఎంఏ విద్యనభ్యసించిన సువేందు అధికారి.. 1989లో కాంగ్రెస్ వి ద్యార్థి మండలితో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995లో కాంతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీ చేరారు. సు వెందు 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో సౌత్ కాంటాయ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కొంటాయా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మూడేళ్లు పదవిలో ఉన్నారు. 

నందీగ్రామ్ ఉద్యమానికి నాయకత్వం

2007 నందీగ్రామ్ భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమానికి సువేందు అధికారి నా యకత్వం వహించి, కీలకభూమిక పోషించారు. నంద్రిగ్రామ్‌లో 10 వేల ఎకరాలను సమీకరించి సెజ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం తలపించింది. దీనికి వ్యతిరేకంగా టీఎంసీ భారీగా ఆందోళనలు చేపట్టింది. వీటిని సువేందు ముందుండి నడింపించారు.

ఈ ఉద్యమం విజయవంతం కావడంతో.. జం గల్ మహ ల్ ప్రాంతమైన పశ్చిమ మేదినీపూర్, పురూలియా, బాం కురా జిల్లాలకు టీఎంసీ ఇన్‌చా ర్జిగా సువేందను మమత నియమించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. 2009లో తుమ్లుక్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం పొంది, మమత సర్కారులో 2020 వరకు మంత్రిగా కొనసాగారు. 

టీఎంసీని వీడి.. బీజేపీలోకి

టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. అప్పటి నుంచి టీఎంసీలో సువేందు ప్రభావం మ రింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నంబర్ ఈయనే అని అంతా అనుకున్నా రు. అయితే మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు ఇచ్చేలా ఉండడంతో సువేందుకు మింగుడు పడలేదు.

దీంతో 2020 చివరలో అనూహ్యంగా టీఎంసీని వీడి, అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరా రు. 2021లో నందీగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని మట్టికరిపించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి పక్ష నేతగా వ్యవహరించారు. 2026 ఎన్నికల్లో భవానీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచి, మమతా బెనర్జీని 15వేలకుపైగా మెజార్టీతో ఓడించారు.