16 July, 2026 | 2:04 AM

ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

16-07-2026 01:55 AM

నాణ్యత పరీక్షలకు నమూనాల సేకరణ.. 

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: మండల వ్యవసాయ అధికారి

అశ్వాపురం, జూలై 15 (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చర్యల్లో భాగంగా బుధవారం అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి మహేష్ చంద్ర చటర్జీ మండలంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సీఓ) నిబంధనల మేరకు వివిధ రకాల ఎరువుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపించారు. తనిఖీల సమయంలో ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, లైసెన్సులు, స్టాక్ రిజిస్టర్లు, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించి, అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని డీలర్లకు సూచించారు.

రైతులకు ఎరువులు విక్రయించే ప్రతిసారి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధిక ధరకు విక్రయించరాదని హెచ్చరించారు. నాణ్యత ప్రమాణాలకు విరుద్ధమైన ఎరువుల విక్రయం,ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్1985 నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, ఏవైనా అక్రమాలు గమనిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.