విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
అర్మూర్, ఆగస్టు 5 (విజయ క్రాంతి) : విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ, ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని జీవితంలో మంచి స్థాయికి ఎదిగి తల్లిదండ్రులు గర్వపడేలా నిలవాలని ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ అన్నారు. బుధవారం ఆర్మూర్ మండలం చేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీనుగు లక్ష్మణ్ 13వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎఫ్‌ఏ ఫార్మేట్ బుక్స్, టీ-షరట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ హాజరై విద్యార్థులకు పుస్తకాలు, టీ-షరట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో విలువైనదని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశయాలను నెరవేర్చడంతో పాటు, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
తండ్రి మీనుగు లక్ష్మణ్ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, టీ-షరట్స్ పంపిణీ చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పోలీసు రాజేశ్వర్ సేవాభావాన్ని సీఐ సత్యనారాయణ గౌడ్ అభినందించారు. అనంతరం విద్యార్థులు, విద్యార్థినులకు ఎఫ్‌ఏ ఫార్మేట్ బుక్స్ మరియు టీ-షరట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సారంగి శాంతికుమార్, ప్రధానోపాధ్యాయురాలు చేతనకుమారి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నాగరాజు, పోలీసు రాజేశ్వర్, ఉపాధ్యాయులు సౌడ రవి, చంద్రకళ, విక్రమ్ సింహ, భాగవతుల వనజ, మనీష్, విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.






