సంయమనం పాటించాలి
- కౌన్సిలింగ్, చర్చలతోనే శాంతింపజేయాలి
- బలప్రయోగం చేయొద్దు
- భద్రతా బలగాలు, పోలీసులకు సుప్రీంకోర్టు సూచన
- ‘సీజేపీ’నిరసనలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం
- హింసకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచన
న్యూఢిల్లీ, ఆగస్టు 5: శాంతియుత నిరసనలను అణిచివేసేందుకు బలప్రయోగం చేయడం సరైన మార్గం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆందోళనల సమయంలో పోలీసులు, భద్రతా బలగాలు అత్యంత సం యమనంతో వ్యవహరించాలని సూచించింది. బలవంతపు చర్యలు పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఢిల్లీలో జరిగిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిరసనలకు సంబంధించిన పిటిషన్‌ను బుధవారం విచారించిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు ప్రజల హక్కులో భాగమని పేర్కొన్న న్యాయస్థానం, యువతతో వ్యవహరించేటప్పుడు అధికారులు ఓర్పు, వివేకంతో వ్యవహరించాలని సూచించింది. కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వినా వెంటనే ప్రతిగా బలప్రయోగానికి దిగకూడదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ము ందుగా వారి ఆందోళనకు గల కారణాలను తెలుసుకుని, సమస్యలను ఓపికగా వినేందుకు ప్రయత్నించాలని పేర్కొంది. యువతను శిక్షించడం కంటే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సరైన మార్గదర్శకత్వం కల్పించ డం మెరుగైన పరిష్కారమని స్పష్టం చేసింది.
ప్రభుత్వ బలప్రయోగం వల్ల చిన్నచిన్న వివాదాలు కూడా పెద్ద ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. నీట్ పరీక్షల అవకతవకలను నిరసిస్తూ ఈ నెల 20న ఢిల్లీలో విద్యార్థులు, యువత పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఆందోళనల ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నిరసనల సందర్భంగా కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశార ని పేర్కొంటూ, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
విద్యార్థులకు సహనం ఉండాలి
శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యంలో హక్కు అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని, నిరసన సమయంలో హింసకు దూరంగా ఉండాలని, రాళ్లు రువ్వడం వంటి చర్యలకు పాల్పడకూడదని సుప్రీంకోర్టు సూచించింది. తమ సమస్యలను శాంతియుత మార్గాల్లో, చట్టపరమైన పద్ధతుల్లో వ్యక్తపరచాలని.. అధికారులు స్పందించేలా సహనం, క్రమశిక్షణతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. నిరసనల అసలు ఉద్దేశం సమస్యల పరిష్కారానికే కానీ, ఉద్రిక్తతలు సృష్టించడం కాదని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.






