సీపీఐ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నాం
కొత్తపల్లి,(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న పోరాటం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడడం లేదా, అదే డిమాండ్ కరీంనగర్ లో వామపక్ష ఇతర విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి విద్యార్థి సంఘాల నేతలను అక్రమంగా, ముందస్తుగా, ఆందోళన ప్రదేశాల్లో అరెస్టులు చేపించడాన్ని సిపిఐ కరీంనగర్ జిల్లా సమితి పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఇతర సంస్థల వారు,సామాజిక వేత్తలు గత మూడు రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహిస్తుంటే వారిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ స్వయంగా ప్రధాని ఇంటి ముందు ఆందోళనకు దిగడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశంపై ఆందోళన చేసిందని,ఒక్క విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎందుకు అరెస్ట్ చేస్తుందో,ఉద్యమాలను ఎందుకు అణచివేస్తుందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఈ సందర్బంగా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.






